ప్రయాణమునకు ముందు గుర్రములకు, ఏనుగులకు కర్పూర నీరాజనము లీయబడెను. నారికేళములు బలిగా అర్పింపబడెను. బ్రాహ్మణులకు గోవులు, భూములు దానము లీయబడెను. మహాచైత్యమున కోటిదీపారాధన జరిగెను. చైత్యఘంటికలు నాదములు చేయుచుండెను. భిక్షుకులు, బ్రాహ్మణులు ఆశీర్వాదములు సలిపిరి. అంతకు తొమ్మిదిరోజులనుండియు బ్రాహ్మణులు జయయజ్ఞములు సలిపిరి. ఆ పురోడాశము చక్రవర్తికి ప్రసాదమిచ్చినారు ఋత్విజులు. నాగపూజలు, గ్రామదేవతల భజనలు జరిగెను.
భేరీ భాంకారాది మంగళవాద్యములు సెలగ చక్రవర్తి మహాగజము సర్వాలంకార భూషితమై, హిమాలయోత్తుంగశిఖరమువలె సాగిపోయినది.
అందధివసించినవారు చక్రవర్తియు, చారుగుప్తుడును. చారుగుప్తుడును దివ్యకవచధారియై అర్జునునిప్రక్క నున్న శ్రీకృష్ణునివలె వెలిగిపోయెను.
హిమబిందు రాజకుమారికలతోపాటు చక్రవర్తిగజమునకు ఆరతిచ్చినది. ఆమెలో నా ఉదయకాలపు విషాదముకాని, నిర్వేదముకాని ఏమియు లేదు. ఆమె తక్కిన బాలలతో బాటు నవ్వుచు కలకలలాడుచున్నది. చారుగుప్తుడది చూచి యూరటనంది, సంతుష్టుడై దూరమునుండియే యామెను “చిరంజీవ, ఇష్టకామ్యార్థసిద్దిరస్తు” అని అశీర్వదించుకొనెను. ఆమె కామ్యార్థము?
18. అల్లరి పిల్లలు
సార్వభౌముడు సైన్యముతో వెడలిపోవు శుభముహూర్తమునందు ఆ మహోత్సవము గమనించుటకు సువర్ణశ్రీకుమారుడును వచ్చియుండెను. సార్వభౌమునితో ధర్మనందియు, అమృతపాదార్హతులు, మహారాజపురోహితులు, శ్రమణకులు, బ్రాహ్మణులు, మహామంత్రి ఆచీర్ణులవారు వెడలినారు.
నాగబంధునిక, సిద్ధార్థినికయు, శక్తిమతీదేవియు, మహాలియు కొందరు పరిచారికలు రథములపై కోటలోనికి వచ్చి ప్రయాణోత్సవముల దిలకించిరి. నాగబంధునికయు, సిద్ధార్థినికయు మహారాజు గజమునకు సింహపతాకవాహయగు మహదాంధ్ర శాతవాహ దంతావళమునకు, ధర్మనందులవారు అమృతపాదార్హతులు ఎక్కిన భద్రదంతికి హారతులు సమర్పించిరి.
నాగబంధునికకు తన అన్నయు, హిమబిందును రెండుసారులు హిమబిందు క్రీడావనమున కలిసినారని తెలియును. హిమబిందును, సువర్ణశ్రీయు నొకరినొకరు గాఢముగ ప్రేమించుకొనుచున్నారని స్పష్టముగ నామె కవగతమైనది. ఆమె ఈ పవిత్ర సంఘటన మూహించుకొని పొందిన యానందమునకు మేరలేదు. ఆ రెండుసారులు సమావేశానంతరము సువర్ణశ్రీ రాత్రి ఇంటికి వచ్చినతోడనే నాగబంధునిక అన్నగారిని ఆతనిమందిరమున ఏకాంతమున కలసికొనినది. ఈ నాడు,
“అన్నా! ప్రాతర్హిమబిందులు ఉదయారుణకాంతిచే సువర్ణశ్రీకలితములగుట నిజమేనా?” అని నవ్వినది.
“ఓహోహో! శ్లేషకవిత్వం చెప్పుచున్నదండీ మాచెల్లాయి! గెలిచితివి గనుక సార్వభౌములూ, సరసాంగులూ నీకే చేస్తారు సత్కారాలు! బహిరంగ సత్కారాలూ, అంతరాంగార్పణలూ అన్నీ నీకే జరుగు చుండెగదా!”
అడివి బాపిరాజు రచనలు - 2
• 121 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)