పుట:Gurujadalu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కరటక: (తనలో) నీ ఆసక్తి నా శ్రద్ధ వక్కలాగే వున్నాయి. నీ బుద్దులు చూస్తే కిందను పెడితే పంటా మీదినిపెడితే వానా లేకుండా వున్నది. (ప్రకాశంగా) చవువు యెందుకురా అబ్బీ? పొట్ట పోషించుకోవడం కోసం గదా? నీకు మా అమ్మినిచ్చి పెళ్ళిచేస్తాను. నీకు పెళ్లికాదన్న భయం అక్కరలేదు.

శిష్యుడు: యన్ని వందలు పుచ్చుకుని కన్యాదానం చేస్తారేమిటి?

కరటక: నీదగ్గిర డబ్బు పుచ్చుకుంటానా? ఆ ఆచారం మా యింటా వంటా కూడా లేదు. ఒక పాతికభూమి పిల్లకు వ్రాసి యిచ్చేస్తాను.

(శిష్యుడు సంతోషమును దెలుపుడు చేయునటుల వికాసముగా ముఖము పెట్టుచున్నాడు)

గాని నేను చెప్పినపని అల్లా చేస్తూ గురుభక్తితో వుండాలి.

శిష్యుడు: మీరు చెప్పినపని యెప్పుడు చెయ్యలేదు?

కరటక: యీవేళ చిన్నమ్మి వివాహం విషమై జరిగిన చర్చ విన్నావుగదా - లుబ్ధావధానులు సంబంధం జరగకుండా చెయ్యవలెను. నీకు ఆడవేషం వేసి తీసుకవెళ్లి అతనికి పెళ్లి చేస్తాను. నీకు మన మహారాజావారి నాటక కంపెనీలో ఆడపిల్ల వేషం అలవాటే గనుక యవరూ భేదించలేరు. ఈడున్నా పొట్టిగా కూడా వున్నావు. ఆడవేషంతో నిన్ను చూచిన తరువాత లుబ్ధావధానులు తప్పకుండా నిన్ను పెళ్ళాడడానికి వప్పుకుంటాడు.

శిష్యుడు: యిదెంతపని.

కరటక: గాని బహుజాగ్రత్తగా వుండాలి. ఏమయినా వ్రాత ప్రోతం వచ్చిందంటే కొంప ములిగిపోతుంది. పదిరోజులు వాళ్ళయింట్లో వుండి యిల్లు గుల్లచేసి గందర గోళం పెట్టివెళ్ళిపోయి రావలెను. మల్లవరంలో నీకోసం కనిపెట్టుకుని వుంటాను.

శిష్యుడు: మీరు చెప్పిన దానికంటె యెక్కువ చేసుకు వస్తాను.

కరటక: యీ పనిలో నేను చెప్పిన ప్రకారం నడుచుకుంటే తప్పకుండా నీకు గొప్ప వుపకారం చేస్తాను. మా పిల్లని కన్యాదానం చేసి నిన్ను యిల్లరికం వుంచుకుంటాను.

శిష్యుడు: మీరే తల్లీ దండ్రీ అని మొదటినుంచీ ఆలోచించుకుంటూనే వున్నాను. మీ ఆజ్ఞకు యెప్పుడూ మీరేవాడిని కాను.

కరటక: ఏదీ శ్లోకం చదువు.

శిష్యుడు: సతత్ర మంచేషు మనోజ్ఞవేషాం.

(తెర దించవలెను)

గురుజాడలు

145

కన్యాశుల్కము - తొలికూర్పు