పుట:Gurujadalu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బంట్రోతు: అయ్యా మొన్న మీరు వేయించుకొన్న పొటిగ్రాఫుల ఖరీదు అడగమని మా పంతులు గారు పంపించారు.

గిరీశ: (వినబడనట్టు నటించుచు)

గంభీరవాగ్వ్యవహారైక ధురంధరత్వమగు జిహ్వలోలి మత్తలికిన్! జనికిందల్లికి కారవేళ్లికి ధనుర్జ్వావల్లి నీరుల్లికిన్!!

బంట్రోతు: యంతమందిని పంపించినా యిదుగో యిస్తామని అదుగో యిస్తామని తిప్పుతూ వచ్చేవారట. నేను వాళ్ళలాగు వూరుకునే వాడను కాను.

గిరీశ : అయ్య కోనేటికి తోవయిదే.

బంట్రోతు : యిదెక్కడ చెమిటి మహాలోకము వచ్చిందయా.

గిరీశ : కోమటి దుకాణమా? కస్పాబజారులో కాని ఇటివైపు లేదు.

బంట్రోతు : (గట్టిగా చెవిదగ్గిన నోరుపెట్టి) పొటిగ్రాపుల ఖరీదు యిస్తారా ఇవ్వరా?

గిరీశ : బస రాధారీ బంగళాలో చెయ్యవచ్చును.

బంట్రోతు : (మరీగట్టిగా) మీరూ సానిదీ కలిసి వేయించు కున్న పొటిగ్రాఫు ఖరీదు 16 రూపాయలు. అప్పుడే యిస్తామని యింకా తిప్పలు పెడుతూన్నారు.

గిరీశ : ఓహో నీవా! నింపాదిగా మాట్లాడు. నింపాదిగా మాట్లాడు. రేపు వుదయం తప్పకుండా 8 ఘంటలకు పూటకూళ్లమ్మ యింటికి వచ్చినట్టైనా రూపాయలు అణాపైసలతో ఇచ్చివేస్తాను. మీ పంతులుకు స్నేహమూ మంచీ చెడ్డా అక్కరలేదూ. ఇంత తొందర పెట్టడానికి యేవూరైనా పారిపోతామా యేమిటి.

బంట్రోతు : మాటలతో కార్యము లేదు రూపాయలు నిలువబెట్టి మరీ పుచ్చుకోమన్నారు.

గిరీశ : పెద్దమనిషివి నువ్వూ అలాగే అనడం ధర్మమేనా? రేపు వుదయం యివ్వకపోతే మాలవాడి కొడుకు ఛండాలుడుతో సమానము - ఇంకా నీకు నమ్మకము లేకపోతే యిదుగో గాయిత్రి పట్టుకు ప్రమాణం చేస్తాను.

బంట్రో : కానియ్యండి రేపు వుదయం ఇయ్యకపోతే మాత్రం భవిష్యం వుండదు

(అని నిష్క్రమించుచున్నాడు.)

గిరీశ: (తనలో) ఇన్నాళ్ళకు జంఝ్యపుపోచ వినియోగం లోకి వచ్చింది. ధియాసొఫిస్ట్ చెప్పినట్లు మన ఓల్డు కస్టమ్సుకు ప్రతిదానికీ యెదో ఒక ఉపయోగం ఆలోచించే మన వాళ్ళు నియమించారు. యిప్పుడు నాకు బోధపడ్డది.

గురుజాడలు

135

కన్యాశుల్కము - తొలికూర్పు