గుంటూరు మండల దశమ గ్రంథాలయ మహాసభ, రేపల్లె
అక్టోబరు, 1935
ముద్దల వెంకటగిరిరావుగారి
ఆహ్వాన సంఘాధ్యక్షోపన్యాసము
మంగళకరమగు నీసుముహూర్తమున విద్యావంతులును దేశ సేవాపరాయణులునగు మిమ్మాహ్వానించి యాదరించుటకు సమర్థులెందరో యుండగా నాకీ యవకాశ మిచ్చినందులకు నేనాహ్వానసంఘమువారి కెంతయు కృతజ్ఞుడను. మీవంటి మహాపురుషుల దర్శనముచేత మేమును,మా సోదర పట్టణవాసులును ధన్యులము. గమ్యస్థానము దూరమనక తమకుగల కార్యభారములను సరకుగొనక, మాయాహ్వానముల నంగీకరించి, యీ సరస్వతీ పూజయందు మాతో భాగస్వాములౌట కరుదెంచిన భాషాసేవకులకును, నుపన్యాసకులకును, సదస్యులకును సుస్వాగతము.
మన రేపల్లెసీమ వాసియు, అఖండ త్యాగమూర్తియు, దేశసేవా ధురంధురుడును, బహుభాషా కోవిదుడును, మన ఆంధ్రదేశనాయకులును, కీ॥ శే॥ ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారికి యిందుగా నామనఃపూర్వక వందనము లర్పించుచున్నాను.
వందలకొలదిఏండ్ల జ్ఞాతముగా బరువులెత్తిన వెనక భారతజాతీయత మరల తలయెత్తబూనుకొను టెంతయు శుభస్కరము. అమెరికా, ఇంగ్లండు మొదలగు దేశములలో గ్రంథాలయోద్యమమే ప్రత్యేక జాతీయ నిర్మాణమునకు కారణము. ఆయా దేశములలో జరిగిన మహ త్తర ప్రయత్నముల గురించియు" 'కార్మిడీ” మొదలగు కోటీశ్వరుల మహాత్యాగములను గురించియు నిచట వివరింప జాలనందులకు చింతిల్లుచున్నాను. దానిని గురించి చెప్పదలంచుకొన్నచో భారతమునకంటె పెద్ద గ్రంథమగుటయు ప్రస్తుతాంశమును గూర్చి యుత్సాహాతురులై యున్న మీ యమూల్యావకాశమును నేనవహరింపవలసి వచ్చుటయు యుక్తముకాదు. ఈయుద్యమమునందు, బ్రిటిషు యిండియాయును, స్వదేశ సంస్థానములు గూడ సమముగా పాల్గొన్నవి. కాని ఏయితర రాష్ట్రముగూడ బరోడా రాష్ట్రముతో సమానముగా ముందునకు రాజాలకపోవుట చిత్రము. బరోడా సంస్థానమువారీ యుద్యమమునాదరించి ప్రభుత్వపక్షమున విద్యావంతుల నితర దేశములకంపి వారివిధానమును నేర్పించి గ్రంథాలయోద్యమమును ప్రభుత్వశాఖలలో నొకదానినిగా చేయగలిగిరి. సంస్థానములోని ముఖ్యనగరములలో గ్రంథాలయములు స్థాపించి సంచార గ్రంథాలయ పద్ధతిమీద పల్లెపల్లెకును విజ్ఞానమును వెదజల్లిరి. నిజాం రాష్ట్రమున గూడ నేడు గ్రంథాలయములు విరివిగానే యున్నవి. ఒక్కింత ఆంధ్ర రాష్ట్రమును గురించి కూడ మనవిచేయుదును. ఆర్యవిజ్ఞానమువలె నీయుద్యమముగూడ దక్షిణాపథమున కరుదెంచినపుడు తెలంగాణము యొక్క ప్రాచీన విజ్ఞానము విస్మృతియవనిక నుండి వెలికి చూచినది. నశించిపోవుచున్న వారి విజ్ఞాన కోశముల నొక్కచో సేకరించి రక్షింపవలసిన యవసరము వారికి గోచరించినది. ఈతన్మయతలో పల్లెపట్టణ భేదము లేకుండ నెన్నియో గ్రంథాలయములు నెలకొల్పబడినవి. ఈ గ్రంథాలయముల యభివృద్ధికి నైక్యతకు తోడ్పడుటకు గ్రంథాలయ సర్వస్వమను పత్రిక ప్రారంభింపబడినది. ఆంధ్రరాష్ట్ర కేంద్ర గ్రంథాలయ నిర్మాణ ప్రయత్నములు జరిగినవి. ఒక్కొక్కచో