Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No. 6 (1919).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్ రాబర్టు బేడెను పవెల్

భటోద్యమ సంస్థాపనాచార్యుడు

సేవావ్రత మనాదిసిద్ధముగ భరతవర్షమున బ్రబలియున్నది. అయినను పాశ్చాత్య సాంప్రదాయ ప్రాబల్యమువలన జనులయందు ధర్మబుద్ధి క్రమముగ నశించిపోయి సేవయం దుండెడి వాంఛ క్రమముగ తగ్గిపోవుచున్నది.

ఇటీవల పాశ్చాత్యులుగూడ ధర్మపరత్వముయొక్క మహత్తును దెలిసికొనినవారై సేవావ్రతమునాచరించుటకై పలువిధములఁ బాటుపడుచున్నారు. అట్టి ప్రయత్నములయం దెల్ల భటోద్యమ మగ్రస్థానము నలంకరించి యున్నది.

ఈ యుద్యమమును ౧౯౦౮ వ సంవత్సరమున సర్ రాబర్టు బేడెను పవెలు అను మహనీయునివలన ఇంగ్లాండు దేశమునందు ప్రారంభింపఁబడినది. దక్షిణాఫ్రికాయందు బోయరుయుద్ధము జరుగుకాలమున, పెద్దవారికన్న పిల్లలే తమకిచ్చిన పనులను మిక్కిలి సామర్ధ్యముతో నెర వేర్పగలరని కనుఁగొనిరి. ఒక సేననుండి మఱియొక సేనకు రహస్యపు సందేళములను గొనిపోవుపనికి, పిల్లలను నియోగించి చూచిరి. సాధారణులగుమనుజులు ఈ కార్యములకు దిగుట కష్టతరము, అనేకాపదలపాలు కావలయును. ఒక్కొక్కసారి శత్రువుల చేతిలోఁజిక్కి హతము కావలసివచ్చును. బాలకు లిట్టికష్టములనన్నింటినియోర్చికొని బేడె౯ పవెల్గారి చే నీయఁబడిన కార్యములను జయప్రదముగను అతి సామర్థ్యముతోడను నిర్వహించిరి. బాలకుల ధైర్యసాహసములకచ్చెరు వంది, వారికి సక్రమమగు నొకపద్ధతి నేర్పఱచి శిక్ష నిచ్చిన, వారు దేశమున కెంతో మహోపకారమును జేయఁగలరని యాయనకుఁదోఁచెను. ఈయూహయే భటోద్యమమునకు ప్రథమ సోపాన మయ్యెను. అప్పటినుండియు ఆయన తన యుద్యోగమునుగూడవిడచి పెట్టి యీ యుద్యమాభివృద్ధినిమిత్తమై నిరంతరము పాటుబడుచున్నారు. ఈ యుద్యమ వ్యాపనార్ధమై యి ద్యమతత్వమును గూర్చి యనేకగ్రంధముల నాయన రచించి యున్నారు. యువకులకు సంబంధించిన విషయములను గూర్చి వ్రాయునది యొక పత్రిక - బాలుర విషయములను గూర్చి వ్రాయునది యొక పత్రిక - బాలికాభటులను గూర్చి వ్రాయునది యొకపత్రిక - ఇట్లు వీరు వివిధతరగతుల యందుండు భటులకుఁ బనికివచ్చుటకై ప్రత్యేకముగ పత్రికలను నిర్వహించుచున్నారు. ఏదేశమందైనను యీ యుద్యమ వ్యాపకమునందు వారి గ్రంథములే యాధారములై యున్నవి. వారియొక్క పటమును యీ వ్యాసమునందుఁ జూడఁగలరు.