Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్నను, ఉన్నతమైనభావములందు జీవించియేయున్నవి. నలుదిక్కులకును - పట్టణములకు, పల్లెలకు, యంత్రశాలలకు స్త్రీ సమాజములకు, పాఠశాలలకు, కారాగారములకు, రక్షకభటస్థానమునకు - పలుస్థలములకుపోవలెనని అవిఉరకలెత్తు చున్నవి. అనేకల్లెలయందలి గ్రంథాలయములకు ఈ సంచారగ్రంథాలయపేటికలే ప్రాతిపదికములైయున్నవి.

కర్ర పెట్టెలు — అందులో గ్రంధములు - అంతే - ఆవి వివిధజనులమనస్సులయ౦దు నాగరికతాబీజములును నాటుచున్నవి. అనేకగృహములనవి సౌఖ్యవంతములుగ జేయుచున్నవి. అనేక పాఠశాలలయందలి పిల్లలకవి జ్ఞానబోధనుగావించుచున్నవి. ఒంటరిగానుండు అనేకమందికవి స్నేహితులలోటును దీర్చుచున్నవి. అవి అద్భుతములను చేయుచున్నవి. అయినప్పటికి వానిఖరీదు స్వల్పము. అందుచేత కేంద్రగ్రంథాలయము వారు ఈపనినిమిక్కిలి ఆసక్తితో చేయుచున్నారు.

చిత్రపట ప్రదర్శనము.

ఈశాఖను దర్శించినపుడు ఆగొప్పవారే ఇట్లనిరట:-

“బొమ్మలుచూపు నాటకశాలతో సమానమైన స్థితికి దిగుట గ్రంథాలయమునకు దగినపనిగాదు. గ్రంథములను పత్రికలను సంపాదించి, జనులు చదువుకొనుటకియ్యవలసిన గ్రంధాలయము - జనులను ఆనందపరుచుటకు ప్రయత్నించుటయా? కేంద్ర గ్రంథాలయమువారికి పిచ్చిఎత్తియున్నగాని చిత్రపటప్రదర్శనశాఖను ప్రారంభించి యుండరు” దానికి గ్రంధభాండా గారిట్లు జవాబిచ్చెను:— "అయ్యా ! దయచేసికొంచెము శాంతము వహింపుడు. నేను చెప్పుసంగతులు వినకుండ నన్ను నిందించకండి.” దానికిగూడ ఆగొప్పవారిట్లనిరి: “వెంటనేమీజవాబా? ఇట్టి నిరుపయోగమైన పనినిగూడ సమధి౯౦పబూనిన ప్రయోజనమేమి?" అందుమీద గ్రంథభాండాగారి శాంతముతోనిట్లు చెప్పెను:— “చదువురాక జ్ఞానము లేక, భావములులేక, ఉన్నతస్థితిని పొందవలయుననెడి కోరిక లేక, జీవితమునందానందములేక, అసహాయులై, నిర్భాగ్యలైయున్న జనులకొరకు ఈచిత్రపటప్రదర్శనశాఖను ప్రారఁభించితిమి. నిత్యజీవనమునందు వారి కనుభవసిద్ధములుగనుండదగిన ఆనేక విషయములను గూర్చిన చిత్రపటములనువారికిచూపి బోధింతుము. ప్రకృతిశాస్త్రము, మానవశరీరము, ఆరోగ్యము, కళలు, పరిశ్రమలు, మున్నగు అనేకవిషయములనుగూర్చిన పటములను వారికిజూపి, జ్ఞానవంతులుగచేసెదము. నాటకములు, చరిత్రలు, కథలు మున్నగునవిచెప్పుచు వానికి సంబంధించిన బొమ్మలనుమాపుచు వారికానందమును కలుగచేసెదము. భూగోళశాస్త్ర విషయములను పటములతో బోధించి, వారికియీ ప్రపంచముయొక్క స్వరూపమును గోచరింపజేతుము. వివిధ దేశములందలి జనులనడవడికలు, గొప్పస్థలములు మున్నగువానినిజూపి వారికి జిజ్ఞాస గల్పింతుము. ఇంతేగాక ఇంకను అనేక సంగతులు వారికి పరిస్ఫుటముగను, హృద్దతమగునట్లును బోధింతుము. 'సినిమెటో గ్రాఫ్' ప్రదర్శనములలో ప్రదర్శకుడు ఊరకే నిలువబడియుండులాగున మేమునిలువబడియుండము. ఒక బొమ్మనుచూపుటకు పూర్వము, చూపుచున్నప్పుడు, చూపుటముగింపబడినప్పుడుగూడ, మేముమాట్లాడుచునేయుండి ఆ బొమ్మనుగూర్చి వివరించుచు దానివలన నేర్చుకొనవలసిన సంగతులను వారికి చెప్పెదము. ఈబొమ్మల ప్రదర్శకములకు అందరును రావచ్చును. ఎవరైనను సొమ్మేమియు ఇయ్యనక్కరలేదు. రాజ్యములందు మారుమూలలనుండుటచే, 'సినిమెటోగ్రాఫ్' కంపెనీలు ఎప్పుడుగానిపోజాలనట్టి కుగ్రామములకుగూడ మా సినిమెటోగ్రాఫ్ నంపి, జనుల కానందమును గలిగించెదము అంతట వారి అభిప్రాయములన్నియు మారి, వీరుచేయుచున్న పనినిగూర్చి మెచ్చుకొనిరి.

ఈ కేంద్రగ్రంథాలయమును స్థాపించి కొద్దివత్సరములు మాత్రమే అయినప్పటికిని, నవీనగ్రంథాలయోద్యమము భారతవర్షమున ఎట్లుప్రబలచేయదగునో ప్రదర్శించినది. ఈ కేంద్రగ్రంథాలయము ఇపుడు రాజాగారి స్వంతభవనమునందే ఉన్నది. దానికి ప్రత్యేకభవనమును నిర్మాణముచేయుటకై ప్రయత్నములు రాజుగారు చేయుచున్నారు. దీనినికట్టుటకై ప్రత్యేక మొకస్థలమును లక్షరూపాయిలు ఖరీదునకు దీసికొనిరి. మహారాజుగారికీ కేఁద్రగ్రంథాలయము ముద్దుబిడ్డ. ఇక దానియొక్క అభివృద్ధికేమి కొరతగలదు?