Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శోధనకు నిలయముగను, చేయుటెట్లు?- అను చింతనలే కేంద్రగ్రంథాలయమును కలతబెట్టుచుండును. ఈ ప్రశ్నలకు జవాబులను చాలభాగ మది కనుగొనినది. మిగిలిన వానికిగూడ కనుగొనుచున్నది.

బాలుర ఆటలు.

గ్రంథాలయములయందు బాలురు ఆటలాడుకొనుటకు - అవకాశముగల్పించుట కలలోనైన తలంపజాలని విషయము. ౧౯౧౨ సం॥న మహారాజాగారి అభిలాషచే కేంద్రగ్రంథాలయమునందు బాలశాఖ ప్రారంభింపబడినది. అభివృద్ధి మాగ౯ములను సరియైన దృక్కులతో చూడజాలని వారికీవిషయము వింతగొల్పవచ్చును. “గ్రంథాలయములు చదువుటకా, ఆటలాడుటకా? గ్రంథాలయములకు పోవు పిల్లలు ఆటలకు మరిగి చెడిపోరా? వారి “కాలము వృధా కాదా?" అని అట్టివారు ప్రశ్నింతురు. ఈ కాలమునందు గ్రంథాలయము పెద్దవారలకు మాత్రమెకాదు; భాల్యమునుండియు గ్రంథాలయములరుచిని చూచినవారే పెద్దవారైన పిమ్మట వానిపోషకులగుదురు. అందుచేత పెద్దలకంటే పిల్లలకు కావలసిన విషయములందే ఈకాలమునందలి గ్రంథాలయములు విశేషశ్రద్ధను వహించును. ఆటలకంటే పిల్లలకు హృదయరంజకములగు విషయములెవ్వి? గ్రంథాలయమున కనుబంధముగ నున్న బాలశాఖయందు ఆటలనాడుకొనుటవలన పిల్లలెందుకు చెడిపోయెదరు? ఆనందముగానుండుట లాభకరముగాదా? వివేకము మందముగానుండుకాలము బాల్యమనియు పిల్లలు ఆటలందు వినియోగించు కాలము వృధాయగుటకు బదులు అభివృద్ధి హేతువనియు తెలిసికొనుడు. బాలశాఖను నడుపునట్టి భాండాగారియెడల క్రమముగ పిల్లలు ఉంచునట్టి నమ్మకము, చూపునట్టి గౌరవములను చూచినవాడెవ్వడును - అక్కడవారు ఆడునట్టి ఆటలు అనావశ్యకములనియు అసంగతములనియు వారిగుణములను చెరచుననియు చెప్పజాలరు. బాల్యమునందు గ్రంథాలయ మనువలలో దగుల్కొనజేసి, గ్రంథపఠనాభిలాషను కలిగించి, పెద్దవారగునప్పటికి - అనగా వారివివేకము మందముగా నుండుటనుమాని జాగరూకతావస్థను పొందుకాలమాసన్నమగుసరికి - గ్రంథాలయముయొక్క ఆశ్రయులుగ చేయుచున్నపని చూచినవారెవ్వరును బలశాఖయందు పిల్లలాడుకొనుటను చూచి వానివలన లాభము లేదని భ్రమింపరు.

కథలు చెప్పుట.

భారతవర్షమునందు కథలు చెప్పు ఆచారము మిక్కిలి పురాతనము. మనగృహములందు ఇప్పటికిని ముసలమ్మలు తమచుట్టును పిల్లలనుచేర్చి వారికి చక్కని కధలను చెప్పుచుందుకు. గ్రంథాలయ శాస్త్రమునందు ప్రపంచమునంతకును ఆదర్శప్రాయమైయున్న అమెరికాదేశమునందీ కథలు చెప్పుటను, గ్రంథాలయముల ప్రయోజనములను నెరవేర్చుకొనుటకై ప్రధమమునందుపయోగింపబడినది. అందుచేత అమెరికానుండివచ్చిన శాస్త్రవేత్తచే ప్రారంభింపబడిన బరోడా కేంద్ర గ్రంథాలయమునందుగూడ కొద్ది సంవత్సరముల క్రిందట కధలు చెప్పుపద్ధతి ప్రారంభింపబడినది.

కథలు బాలురకు అత్యానందమును గలుగజేయును. కథలవలన బాలురకు దైవభక్తిగలుగును. కధలువినుట వలన తమంతటతాము ఏర్చుకొని చదువజాలని గ్రంధములను వారు చదువుట కభిలాషకలుగును. ఇంతేగాక తమకు కధలు చెప్పునట్టి భండాగారి యెడల ప్రేమ గలిగి, అతడు చెప్పునట్టి బోధనలయందు విశ్వాసము కుదురును.

సంచారగ్రంథాలయములు

.

"ఓహో! ఏమిటిది? కర్రపెట్టెలు, కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కాని అన్నిటియందును పుస్తకములు కలవు. వీనియందేమియు విశేషమున్నటులు నాతలంపునకు దట్టుటలేదు ఈ పెట్టెలమందేమైన విశేషమున్నదా? అవికూడ సందేశమేమైన దెలుపు నాయేమి?" అని బగోడా కేంద్రగ్రంథాలయమును దర్శించిన గొప్పవారొకరు అనిరట. ఆ పెట్టెలయందు విశేషమేగలదు. ఆ సంచార గ్రంథాలయ పేటికలు పైకి జీవము లేనివిగ కాన్పించుచు