గ్రంథాలయ సర్వస్వము
మనుష్య స్వభావగ్రహణశక్తియు కట్టుబాట్లు చేయుట యందలి నేర్పురుఁ గనుఁడు.
ఇటులె “మార్గపాలి” క్రీడఁ జూడఁడు. ఇది పాశ్చాత్యుల క్రీడలలోని “టగ్ ఆఫ్ వార్ "నకు ప్రతిరూపకమో మాతృకయో యనక చెల్లదు. దీనిలోని విశేష మేమన, ధర్మాచరణైక దేశమగుట చేతను దర్భాదియుపకరణములు కల్గుటచేతను పవిత్రతగలదు. ఉన్నత జాతివారిని తక్కువజాతివారిని నిరుపక్షములవారిగాఁ జేయుటచే మైత్రిస్థానమగుచున్నది. తక్కుగల ప్రయోజనములు పైవానికివలెనే యూహింపఁదగును.
ఆంధ్రదేశమున సుప్రసిద్ధముగ తూటాలను గాల్చెదరు. ఇందు శతఘ్నులఁ జేయువారును, తూటాలఁజేయు వారు పూలపొట్లములను మతాబ్లను అట్టి మఱికొన్ని చిత్రములనుఁ జేయువారును మొన్న మొన్నటి వఱకు నెల్లెడలు వేనవేలుండెడివారు. శాసన కాఠిన్యము హెచ్చిన కొలఁది ఈ యుత్సాహమును దీనిచే జీవించువారి వృత్తులును నశించి, జపాను దేశమునుండి వచ్చు బెండు పువ్వులు మొదలగునవి వెలసినవి.
మఱియు దీపావళినాటికి వతఉకులు తమ ఆయవ్యయముల లెక్కల సరిపుచ్చుకొని సంవత్సరమయినట్టు. ఎంచు వాడుకయును ముఖ్యముగా బొంబాయి మొదలగు చోట్లగలదు. ఇందుచే భారతీయుల వ్యాపారవత్సరము దీపావళితో మారును. లక్ష్మీపూజగూడ నీ పండుగయందుండుటచే నిది గడుంగడు సమంజసమయియున్నది..
ఇట్టి పూజలతోడను క్రీడలతోడను నాచారములతోడను ననుశ్రుతముగా వచ్చుచున్న ఈ పండువు జాతీయోత్సవములలో నెంతవన్నె కెక్కినదియో మీరె యూహించగలరు. ధర్మమున నరకాపవాకరము. పితరులకు స్వస్థప్రదము. అర్ధమునకా ఆలక్ష్మినివారకము; లక్ష్మిసంపాదకము. కామమున మైత్రిని ఉత్సాహమును ప్రత్యాశను గల్పించు క్రీడలగల్గియున్నది. దీనివ్యుత్పాదకశక్తి (Educative influence) యన్న నో సర్వతోముఖము; ఆస్తికత్వము, విధి పరత్వము, యస్కామత, మైత్రి, ఉత్సాహము మొదలగునవి యన్నియు దీనివలన నుత్తేజితములగుచున్నవి.
__కొలచిన వేంకట అప్పాశర్మ ఎం.ఏ.
రాజా వెలుగోటి రాజగోపాలకృష్ణయాచేంద్ర బహదర్
క.తినకీర్తియెంతకాలము
వినఁబడునిజ్జగమునందు వెలయఁగ నందా
కను బుణ్యలోక సౌఖ్యం
బున నెంతియు నుల్లసిల్లుఁ బురుషుండనఘా!
వేంకటగిరి సంస్థానాధీశ్వరులు వెలుగోటివారని రావువారని ప్రసిద్ధినొందిన పద్మనాయకులను కులమువారు. వీరి మూల పురుషుఁడు భేతాళ నాయడని ప్రఖ్యాతిగాంచిన చెవ్వి రెడ్డియను రాజు. ఈ రాజు ఘనత గాంచిన కాకతిగణపతిదేవుని రాజ్యకాలమున శౌర్యధైర్యవితరణాది గుణంబుల నాసార్వభౌముని మెప్పించి యనేక బిరుదావళులను, విస్తార రాజ్యములను బహుమానముగ బడసెను. ఈ భేతాళ నాయఁడిట్టి గొప్ప పదవిజెందుటకు ఒక కథ జెప్పుచున్నారు. ఈ భేతాళనాయడు ఆదియందు పిల్లలమఱ్ఱియను గ్రామమునకు అధికారిగా ఉండెనట. అంతట ఒకనాడు ఆకస్మికముగ కోప్పెగ ధనము పొలములో పూడ్చియుండుటను కనుగొని దానిని పొందుటకు గాను బలికై యోచించుచుండగా- అతని సేద్యకాఁడగు రేచుఁడను మాలవాడు తాను అందులకు బలి అయ్యెదననియు, తనవంశము నిలుపుటకై రావు వారియింట వివాహము జరుగునప్పుడెల్ల ముందుగా తన వంశమువారిలో నొక్కరికీ వివాహము జరిగించుచుండవలయునను కొన్ని పద్ధతులు నేర్పాటు చేసికొని బలియయ్యెనట. ఈ నాటి ని ఈ యాచారము జరుగుచునే యున్నది.
ఈ వంశమువారు ఆయారాజుల కాలములో అందునా దేశములందు రాజ్యములు సంపాదించిరి.బొబ్బిలి, పిఠాపురము, జటప్రోలు మొదలగు సంస్థానములిప్పటికిని సుప్రసిద్ధినొందియున్నవి.