Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పవిత్రుఁడగుచున్నాఁడు. శుష్కవ్రతుఁడైన అర్జునుఁడు రసలాలసతచే నార్ద్రుఁడగుచున్నాఁడు. " వలననే కవి,

'శోభనముమీదను శోభనమౌచు నింపుగ౯'

అని విజయవిలాసమును బూర్ణముఁజేసెను.

మూడవదశ అజ్ఞాత వాసము. ఇందు గమనింపదగినది అస్త్రవియోగము. ఈసంవిధానము ముఖ్యముగా అర్జునుని చిత్తసంయమనమునకు స్ఫుటసూచనగాఁ దీసికొనవచ్చును. గాండీవివంటి ధన్వికి చిత్తసంయమనము లేనిచో నిరంకుశమైన ప్రయోగోపసంహారములు లోకనిగ్రహములే పరిణమించి యుండును గాని లోకానుగ్రహకారకములై శాంతించి యుండవు. భారతరణము లోకశాంతి స్థాపనకై సంకల్పింపఁబడినది. ఇది నిర్వివాదము కాక పోయినను సంప్రదాయవాదు లిచ్చిన యర్థము మాత్ర మిదియే కదా? విజయుఁడీ మహాకథకు నాయకుఁడగుట చేతనే సంకల్పసాధనలు రెండును ఇతనియందు యధాపరిమితములై శక్తిమంతములయినవి.

తృతీయవ్యవస్థ కురు క్షేత్రరణరంగమందు ఆరంభించు చున్నది. ఇందు ఒకానొక ఉదారనాయకుని జిజ్ఞాసకాండ చక్కగా విశదీకరింపఁబడినది. అర్జునవిషాదయోగము మహాభారతకథాకంఠమునందు పసుపుత్రాడులాగు వ్రేలాడుచున్నది. అది మాంగల్యమో- ఉరిత్రాడో-నచ్చఁ జిత్రింపవలసిన భారము కవిది.

“ఉ.తాతల మామల౯ సుతులఁ
దండ్రులఁ దమ్ముల నన్నల౯ గురు
వ్రాతము శిష్టకోటి సఖి
వర్గము: దుచ్ఛజనానురూప దు
ర్నీ తివధించి యేఁబడయి
నెత్తుటఁదోగిన రాజ్యభోగముల్
ప్రీతియొనర్చు నే? యశము
పెల్లాడఁ గూర్చునె పెంపొవచ్చునే.

అని అర్జునుఁడు ప్రకంపవాచియై తహతహలాడెను. గాండీవము హస్తమునుండి క్రిందకు జాతిపడెను. దాని శ్రీకృష్ణుఁడు పన్నిన మహాభారత సంగ్రామత్రంతమంతయు ఇసుకయిల్లు కూలినట్లు కూలెను. ఇంక గతియేమి. కృష్ణుడేగతి. ఉభయపక్షవీరులును ప్రత్యక్షముగనో పరోక్షముగనో సంగ్రామ సంప్రాప్తికై పనిచేసిరి. అందు శ్రీకృష్ణుఁడు ప్రముఖుఁడు. వీరులు యుద్ధము నే కాంక్షించిరి. కాంక్షితమె నెట్టికొనివచ్చినది. అస్త్రము లాహూరములైనవి. శస్త్రములు సానలపై మెఱుఁగెక్కినవి. రణజ్వరము వ్యాపించినది. రక్తదాహము తీండ్రించినది. అక్షౌహిణులు వ్యూహముఖముల నడ్డినిలచినవి. పవిత్రమగు కురుక్షేత్రమున నింక నిముసములలో నెత్తురేళ్లు పాఱనున్నవి. అది కడు సంక్షోభాసమయము. కర్మకాండ జరుగవలసినది జ్ఞానకాండ సందుకొనినది. అపుడేమి చేయవలెను? ఉఛయపంక్తులకును సామరస్యమును గొలిపి, అర్జునవిషాదమును తప్పింపవలెనా? లేక ఎత్తినియెత్తు న్యాయసిద్ధమయిన ముగింపునకుఁ దేవలెనా? శ్రీకృష్ణుఁడు రెండవమార్గమున నడచెను. యోధవర్గమును నడిపించెను. గీతోపదేశ మొనర్చి

నిష్కానుకర్మయోగము

నుద్ధరించెను. ధర్మవశుఁడైనఅర్జనుడు స్వజనచ్ఛేదము నాప్తవిధిగా సంగీకరించి కృతకృత్యుఁడయ్యెను; విజయుడయ్యెను. వీరారాధనయోగ్యముగు మహాభారతమునకుఁగ్ర మాగనుతయిన ఉపసంహారమునుగల్పించెను. ఇందుఁగల యర్థస్ఫోటమేమన మహాసంగ్రామమునకుఁ బ్రధాననాయకుఁడయిన అర్జునుఁడు స్వార్థనికతుఁడా-లేక స్వార్థనిస్పృహుఁడా యను వంశము తేలుటయే. దేవదత్తము కురు క్షేత్రమందు మ్రోగువఱకును అర్జునుని మనస్సు విస్ఫుటముగాఁ గానరాలేదు. పరాజితులయిన పౌరుషవంతులకుండు మాత్సర్యస్పర్థలు మాత్రమె కానవచ్చినవి. ఇపుడన్ననో అవి యన్నియును మాఱినవి. అర్జునుఁడు కేవలము పగసాధించుటకై గాండీవమునుటంకరించెనా? లేక నిరంకుశ రణదాహము నాపలేక నెత్తురుకూడుఁ గాంక్షించెనా? లేక రాజ్యలుబ్ధుఁడై తెగించెనా? ఈ సమస్యలు — సమస్యలన నేల సందేహములు - విచ్చిపోవుటకే అర్జునవిషాద యోగము వచ్చినది. ఒక మహాయోధకుమారుని అనుకంపాకారుణ్యాది స్నిగ్ధగుణములను బైకిదెచ్చి చూపినది. అసూయాక్రోధావి క్షుద్రగుణ కాలుష్యమును క్షాళితముఁ జేసినది. తుదకు ఉదాత్తమగు నిష్కామకర్మయోగమును స్థాపించినది. కథానాయకుఁడగు అర్జునుఁడు స్వధర్మబద్ధుఁడై సంకల్ప సన్యాస