Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాచన సోమనాధుడు.

చారిత్రికవిషయములు.

ఈకవిశేఖరుని చరిత్రము సంపూర్ణముగ నిదివఱకాంధ్రలోకమునఁ బ్రకటింపఁబడియుండలేదు. కవిజీవితకర్తలగు శ్రీ గురుజాడ శ్రీరామమూర్తి పంతుల వారీతని చరిత్రము దొరకలేదని వ్రాసియుండిరి. పిమ్మట శ్రీ వీరేశలింగము పంతులు గారీ మహాత్ముఁడు రచియించిన యుత్తర హరివంశమును వ్యయప్రయాసల కోర్చి తంజావూరు మహారాజా వారి పుస్తక భాండాగారము నుండి వ్రాయించి తెప్పించి, ప్రకటించి యాంధ్రలోకమునకమితోపకారమొనర్చిరి. కాని ఈ గ్రంధమువలనఁ గవిచరిత్ర మేమియుఁ దెలియుటకాధారములు లేకపోయెను. గద్యమొక్కటి యీతఁడు తిక్కన సోమయాజి యనంతర మీగ్రంధము వ్రాసినట్లు తెలియఁజేయుచున్నది. శ్రీ వీరేశలింగము పంతులవారీతని గ్రంధమును బరిశీలించియు, నితరాధారములఁ జూచియు, నూహలఁజేసియు సందేహముతోఁ గొంత చరిత్రమును గవుల చరిత్రములోఁ బ్రకటించిరి. ఇటీవల శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులుగారొకచోట నొక శాసనమును బ్రకటించి, శ్రీ వీరేశలింగము పంతులవారితోఁ గాలనిర్ణయ విషయమున నంగీకరించి, తక్కిన విషయములలో భేదాభిప్రాయముల నొసఁగిరి. అవియైన నూహించి వ్రాసినవి. కావున నింతవఱకీ కవిచక్రవర్తి చరిత్రము మనవారికిఁ దెలియదు, తెలిసికొనుటయైన సుకరముకాదు.

ఈకవి యెప్పటివాఁడు?

ఈ విషయమై శ్రీ వీరేశలింగము పంతుల వారిట్లు వ్రాసిరి. “వీనినన్ని టినిబట్టి విచారింపగా సోమకవి యెఱ్ఱాప్రగడకుఁ దరువాతను, శ్రీనాధాదులకుఁ బూర్వము నుండుట స్పష్టము. కాబట్టి యీతఁడు హూణశకము 1880 ప్రాంతములయందున్నాడని యించుమించుగా నిశ్చయింపవచ్చును.” దీనికాధారములు మాత్రము వారెవ్వియుఁ జూపలేదు. వీరుచూపిన ముఖ్యకారణము "పిల్లలమఱి పినవీరన్నయు 'మానన్నయ భట్టు దిక్క కవి నెఱ్ఱాప్రగ్గడ సోముని౯' అని యేఱ్ఱాప్రెగడ తరువాత సోముని జెప్పినాఁడు" అని కవులు ప్రబంధములయందు వ్రాసిన యాదికవి స్తుతి యందున్న వరుసనుబట్టి సోముఁడు యెఱ్ఱాప్రెగ్గడ తరువాత వాఁడని నిర్ణయించినారు."ఇది న్యాయమా? సత్యమగునా?" అని సందియము కలిగి నేనీ విషయమున సూక్ష్మముగఁ బరిశీలించితిని. నీలాసుందరీ పరిణయము, యేకాదశి మహత్మ్యము మున్నగు ప్రబంధములలో ననేకచోట్ల సోముని యెఱ్ఱాప్రగడ కంటెబూర్వమే పేర్కొనిరి. కొందఱు కేవలము యతిప్రాసముల కొఱకు సోముని తిక్కనకంటెఁ బూర్వము పేర్కొనిరి. కావున నట్టి స్వల్ప కారణముల నాధారముచేసికొని కాలనిర్ణయము చేయరాదు. శ్రీ వీరభద్రరావు గారొక శాసనమును కనుగొని రంటినిక గా! అందువలన సోముని విషయమై మనకనేక నూతనాంశములు తెలిసినవి. శ్రీ వీరభద్రరావుగారు మాత్ర మాశాసనమునకుఁ గొంత విపరీతార్ధములఁ గల్పించిరి.

ఆశాసనమున కాలనిర్ణయ భాగమిట్లున్నది:-

“ఆలంకృత శకస్యాభే రసా(ర్తు) నయనేందుభి:౹౹ ఇందు(రు) అను నది శాసనమును కనుగొనిన “రైను”గారు ఏపీ గ్రాఫికా కర్నాటికా పదియవ సంపుటమున, విపరీత వ్యాఖానములతో నీ“ర్తు" నుపూరించిరి. ఇందున్న రస=6, ఆగ్లు=6 ఋతువులు, నయన=2, ఇందు=1 గణితశాస్త్రప్రకారము 6621 (అంకానాంవామతో గతిః.) యెడమవైపునుండి లెక్కించినయెడల 1266 శాలివాహన శకమగుచున్నది. అది పూరించిన వారిపొరపాటు సరిగఁ జూడక 1266 + 78–1244 క్రీ.శ. మని యంగీకరించి, వీరేశలింగము పంతులవారి కాలనిర్ణయ సిద్ధాంతమును వీరభద్రరావు గారంగీకరించిరి.

నాకీవిషయమై సందేహము కలిగి పరిశీలనము చేయుచుండ నదృష్టవశమున నాకు మఱియొక శాసనము దొరికినది. అందు కాలనిర్ణయ భాగమిట్లున్నది:-