Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

49


ద్వితీయ ఆంధ్రదేశ గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభ

రాజమహేంద్రవర పట్టణమున శ్రీ వీరేశలింగ, వసురాయ పుస్తకభాండాగారములు యాహ్వానము ననుసరించి 1915 సం॥ మేనెల 9వ తేదీ మధ్యాహ్నము 2-30 గంటలకు శ్రీ వీరేశలింగము గారి హైస్కూలు భవనమున ద్వితీయ ఆంధ్రదేశ గ్రంధభాండాగార ప్రతినిధుల మహాసభకూడెను. కృష్ణా, గుంటూరు, గోదావరి, విశాఖపట్నము, గంజాం, నెల్లూరు జిల్లాలనుండి 120కంటె నెక్కువగ ప్రతినిధులేతెంచిరి. ప్రతినిధులును ఇతర జనులును మొత్తము మీద 800 మంది జనులు సభనలంకరించిరి.

ప్రధమమున సన్మాన సంఘాధ్యక్షులగు శ్రీ బారు నరసింహారావు గారు, బి.ఏ., బి.ఎల్., తమ స్వాగతోపన్యాసమును జదివిరి. తరువాత చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు పానుగంటి రామారాయనిం గారిని సభకు అగ్రాసనాధిపతిగా నుండునట్లు కోరుచు వారి విషయమై కొంత ముచ్చటించిరి. పెద్దిభొట్ల వీరయ్య గారును, కొండమూడి శ్రీరాములుగారును పై విషయమును బలపరచిరి. అందఱు నేకగ్రీవముగ నొప్పుకొనుచు కరతాళధ్వనుల జేసిరి. అనంతరము శ్రీ పానుగంటి రామారాయనిం గారిని పూలహారముతో గౌరవించి అగ్రాసనాసీనునిం జేసిరి. అగ్రాసనాధిపతి గారు తమ ప్రారంభోపన్యాసమును ఆంధ్రభాషయందు జదివిరి. శ్రీ రామారాయనింగారి సోదరులు గూడ నేతెంచి సభనలంకరించిరి.

తరువాత కార్యదర్శి గారిచే సభకు రాజాలమని వ్రాసిన లేఖలు జదువబడెను. అందు రవీంద్రనాధ ఠాకూరు గారి శాంతి నికేతన మందు విద్యాభ్యాసము జేయుచున్న రాయప్రోలు సుబ్బారావు గారు వ్రాసి పంపించిన పద్యములు మిగుల రసవంతములై, మనోరంజకములై, భావపూరితములై సభ్యుల నందరిని ఆనందవార్థిలోనోలలాడించెను. తరువాత నాళం కృష్ణారావు గారు ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘము యొక్క 1914 ఏప్రిలు మొదలు 1915 ఏప్రిలు ఆఖరువరకు జరిగిన వృత్తాంతమును జదివిరి. పిమ్మట విషయనిణయ సంఘమేర్పాటు గావింపబడి నాటి సభ ముగింపబడెను.

10వ తేదీన ఉదయము 8 గంటలకు తిరిగి సభ కూడెను. ప్రధమమున వడ్డాది సుబ్బారాయుడు గారు దైవప్రార్ధన గావించిరి. తరువాత నూరి వేంకట నరసింహంగారు ఆంధ్రదేశ గ్రంధభాండాగారోద్యమును గూర్చియు, సంచారపుస్తక భాండాగారములను గూర్చి శ్రీపాద సుబ్రహ్మణ్యము గారును, గ్రంథాలయములన నేమి?అవి చేయదగిన పనియేమి? అను విషయమును గూర్చి అయ్యంకి వేంకటరమణయ్యగారును, దేశభాషాప్రాముఖ్యతను గూర్చి వల్లూరి సూర్యనారాయణరావు గారును, ప్రారంభవిద్యకు గ్రంథభాండాగారము లెట్లు తోడ్పడును? యను వంశమును గూర్చి సత్తెనపల్లి హనుమంతరావుగారును, గ్రంధపాలకుని ధర్మములను గూర్చి తేకుమళ్ళ వెంకాజీరావు గారుసు, గ్రంధ విభజనమును గూర్చి వెలిదెండ శ్రీనివాసరావు గారిచే వ్రాయబడిన వ్యాసమును మరొకరును, గ్రంథాలయ ధర్మములనుగూర్చి గుడిపాటి సూర్యనారాయణ గారును ఉపన్యాసముల నిచ్చిరి,

అంతటితో ప్రాతఃకాల సభ ముగిసెను, సాయంకాలము తిరిగి 8.20 గంటలకు సభ సమావేశమయ్యేను. గ్రంథ భాండాగారము లెట్లుండవలెను యను విషయమును గూర్చి చి౦తపంటి వేంకటరమణయ్య గారును, తీత్తి బలరామయ్యగారును, దుగ్గిరాల నుండి వచ్చిన వారొకరును ముచ్చటించిరి. నా యనుభవము'లను గూర్చి కే.జోగారావుగారు జెప్పిరి. ఆనంతర మీదిగువ తీర్మానములు జేయబడినవి:___

1.వ తీర్మానము.

గోపాలకృష్ణగోక్లే గారును, కొక్కొండ వేంకటరత్నం పంతులుగారును, పురాణం వెంకటప్పయ్య గారును, జొన్నవిత్తుల గురునాధం గారును, చనిపోయినందుల