Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్సునిశితబాణజాలములఁ జూర్ణముఁ జేసి విభుత్వ మర్థిఁ గై
కొనుటకు మేటి నయ్యు నయకోవిదవర్య యధర్మసాధ్వసం
బునఁ బరలోకభీతి నది పోవుట కెంతయు సమ్మతించితిన్.

1127


క.

అని యీగతి విలపించుచు, జనకసుతావిభుఁడు శోకసంతాపముచేఁ
గనుఁగొనల నశ్రుకణములు, చనుదేరఁగ నూరకుండె జాలి జనింపన్.

1128


తే.

అంత సౌమిత్రి విగతార్చి యైనవహ్ని, కరణి నిర్వేగ మైనసాగరముపగిది
భూరిదుఃఖార్తి విలపించి యూరకున్న, యగ్రజు ననునయించుచు నపుడు పలికె.

1129


తే.

దేవ మీచెప్పినట్టుల నీవు వెడలి, రాఁగ గతపూర్ణశశి యైనరాత్రిభంగి
నిష్ప్రభత్వంబు నొందుట నిజ మయోధ్య, తండ్రి పరితాప మిం తని తలఁపరాదు.

1130


తే.

నరవరోత్తమ సీతను నన్నుఁ గూర్చి, డెందమునఁ బరితాపంబు నొంద వలవ
దీవిచారంబు నినుఁ దపియింపఁజేయు, ధైర్యవంతున కిది యుచితంబు గాదు.

1131

రాముఁడు లక్ష్మణుఁడు వనమునకు వచ్చుటకు సమ్మతించుట

క.

మనుకులశేఖర యేనును, జనకజయు జలోద్ధృతాంబుచరములభంగి
న్ఘనుని జగదేకపూజ్యుని, నినుఁ బాసి మనంగ లేము నిమిషం బైనన్.

1132


ఆ.

అధిప నీవు లేనియలస్వర్గపద మైన, మదికిఁ దోఁచుఁ దృణసమాన మగుచుఁ
దల్లి యనఁగ నెంత దశరథుఁ డన నెంత, తమ్ముఁ డనఁగ నెంత దలఁప నాకు.

1133


వ.

అని లక్ష్మణుండు పలికిన నత్యంతశ్రేష్ఠం బైనయతనివచనంబు విని రాముండు కొం
డొకసేపు విచారించి ధర్మం బంగీకరించి తమ్మునిరాక కొడంబడి యవ్వనస్పతి
మూలంబున లక్ష్మణవిరచితం బైనపర్ణతల్పంబునందు సీతాసమేతంబుగాఁ బవ్వ
ళించె ని ట్లంధకారబంధురం బైనరాత్రియందు జనసంచారశూన్యం బైనవనంబున
మహాసత్వనంపన్ను లగురామలక్ష్మణులు భయసంభ్రమంబులం జెందక గిరిసాను
గోచరంబు లగుకంఠీరవంబులచందంబున నొప్పి రంతఁ బ్రభాతకాలం బగుటయు
సాంధ్యాదికంబులు దీర్చి యచ్చోటు వాసి గంగాయమునాసంగమప్రదేశంబు
నకుం బోవ సమకట్టి మహారణ్యంబుఁ బ్రవేశించి వివిధంబు లగుభూభాగంబు
లును మనోరమంబు లగువత్సదేశావాంతరదేశంబులును నదృష్టపూర్వంబు
లగువృక్షంబులును నంత నంత విలోకించుచుం జని చని దివసంబు నివృత్త
మాత్రం బగుచుండ రాముండు సౌమిత్రి కి ట్లనియె.

1134


చ.

అనుపమలీలఁ గ్రాలెడు ప్రయాగమునంతట నిండి మ్రోల న
య్యనలునికేతు వై యలరు నధ్వరధూమము మింటఁ బర్వి నూ
తనఘనత న్వహింప శిఖితాండవనాదము లొప్పెనో యన
న్మునికృతవేదమంత్రరవము ల్విన నయ్యెడు వింటె లక్ష్మణా.

1135


క.

ఇం దొకమునిపతి మన కా, నందంబుగ నేఁడు దర్శనం బొసఁగఁ గలం
డిందులకు నీమనంబున, సందియ మందంగ వలదు జననుతశీలా.

1136