Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

రణమున నేవీరుఁడు సుర, గణమున కైన నెదిరింపఁగా రాక బలో
ల్బణవృత్తి నలరునాయన, తృణములపై బవ్వళించె నిప్పుడు గంటే.

1034


తే.

ఘనతపముచేత వివిధయాగములచేత, దానములచేత సకలమంత్రములచేతఁ
బ్రాప్తుఁ డై తుల్యగుణుఁ డయి పరఁగెఁ గాన, జనకున కతిప్రియాత్మజుం డనఘ యితఁడు.

1035


ఆ.

అట్టి రాఘవాన్వయప్రదీపకుఁ డైన, యితఁడు ఘోరవనికి నేగుచుండఁ
జూచి తండ్రి యైనక్షోణీశ్వరుఁడు మను, ననెడుమాట సందియంబు గాదె.

1036


వ.

పితృమరణానంతరంబున మేదిని యనాథ యై యుండఁగలదు యువతులందఱు
నాక్రందనంబుఁ గావించి యలసి నిరానంద లై యుందు రని పలికి వెండియు
ని ట్లనియె.

1037


చ.

నిరుపమవాద్యఘోషముల నృత్యరసంబుల గీతనిస్వనో
త్కరముల భూషణద్యుతులఁ దద్దయు సొంపు వహించురాజమం
దిర మది నేఁడు సంక్షుభితనీరధిమాడ్కి వినష్టతారకాం
బరమువిధంబున న్మిగులఁ బాడఱినట్లుగ నుండునేకదా.

1038


క.

మాయయ్యయుఁ గౌసల్యయు, మాయమ్మయు నేఁటిరాత్రి మహనీయగుణ
శ్రీయుతుల మమ్ముఁ గానక, పాయక నేపగిది వీట బ్రతుకుదు రకటా.

1039


తే.

అనఘ మాతల్లి శత్రుఘ్ను నాశ్రయించి, యొకవిధంబున ధర మనియుండుఁ గాని
యేకసుత యైనకౌసల్య యెట్లు బ్రతుకఁ, గలదు తీర్పంగరానిదుఃఖము వహించి.

1040


క.

అనురక్తజనాకీర్ణం,బును లోకసుఖావహంబు భూరిద్యుతి యౌ
ఘనసాకేతము వ్యసనం, బునఁ గ్రాఁగి నశించు నింకఁ బుణ్యచరిత్రా.

1041


తే.

అగ్రతనయుండు ప్రియుఁడు మహాత్ముఁ డైన, రామభద్రుని విడిచిన రాజవరుని
యొడలఁ బ్రాణంబు లెబ్భంగి నుండు నతఁడు, ప్రియకుమారుఁడు వృద్ధుఁడు నయవిదుండు.

1042


తే.

విపులయశుఁ డైనరామునివిపిన యాత్ర, దలఁచి శోకాగ్నిచేఁ గ్రాఁగి తనువు విడుచుఁ
గాక కౌసల్య మని యుండఁగలదె యింక, నాయమవితాన మాయమ్మ యడలుఁ గాదె.

1043


క.

గ్రద్దన భూమీశ్వరుఁ డా, యిద్దఱముద్దియలపాటు హృదయంబునఁ దాఁ
దద్దయుఁ జింతించి ఘనవి, పద్దశచే డస్సి మేనుఁ బాసెడు సుమ్మీ.

1044


ఆ.

ఇట్టిమాటఁ దలఁప నెంతయు నాగుండె, యవియుచున్న దట్టియడలు మాని
సమ్మదమున నేఁడు ఱొమ్మునఁ జేయిడి, నిద్ర వోవ నెట్లు నేర్తు నయ్య.

1045


ఆ.

తనయువిపినయాత్రఁ దలపోసి మృతుఁ డైన,తండ్రి సంస్కరించి ధన్యు లగుచు
వఱలుచుందు రట్టిభరతాదులకుఁ బోలెఁ, గలుగదయ్యె భాగ్యగరిమ మాకు.

1046