Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నప్రమాదుఁ డై ప్రోచుచు నరుగుచుండ, రామభద్రుని కెద్ది దుర్లభము చెపుమ.

937


క.

వనవాసము సల్పి రయం, బునఁ గ్రమ్మఱ నరుగుదెంచి పొలుపుగఁ జరణం
బునకుఁ బ్రణమిల్లురామునిఁ గనుఁగొని మది సంతసించుకాలము వచ్చున్.

938


క.

రమణీ మాదృశలను శో, కమున బడలకుండఁ దేర్పఁ గాఁ దగు నీ వీ
క్రమమున శోకింపఁగ నిను, హిమకరముఖ దేర్చువార లెవ్వా రిచటన్.

939


క.

తరుణీ రామునికంటెను, బరుఁ డొక్కఁడు లేఁడు ధర్మపరుఁడు జగతిలో
నరుదార రాఘవునియం, దరసిన లే దించు కైన నశుభం బబలా.

940


వ.

మహానుభావుం డగురాముండు లక్ష్మణసహితుం డై యరణ్యంబున నుండి
గ్రమ్మఱఁ బురంబునకుం జనుదెంచి సామ్రాజ్యపట్టాభిషిక్తుం డై జానకిం
గూడి రోహిణీయుక్తుం డైనచంద్రునిభంగి వెలుంగుచు మృదుపీనంబు లగు
కరంబులచేత భవచ్చరణంబులు సంస్పృశింపం జనుదెంచు నప్పు డీవు మేఘ
రాజి శిలోచ్ఛయంబునుం బోలెఁ బరమానందసంభూతబాష్పజలంబులచేత
నక్కుమారశేఖరునిం బ్రోక్షించెదవు సత్యంబుగాఁ బలికితి శోకమో
హంబులు విడిచి యూఱడిల్లు మని యిట్లు సుమిత్రాదేవి పూర్వజన్మకృతభగవ
దారాధనజనితసుకృతపరిపాకంబున శ్రీరామునిం బరమాత్మఁగా నెఱింగి
వివిధవినయసాంత్వవాక్యోపచారంబుల ననేకప్రకారంబుల నాశ్వాసించిన
నాసుమిత్రాదేవివాక్యం బాలకించి శరద్గతం బగునల్పతోయమేఘంబుభంగి
నరదేవపత్ని యగునక్కౌసల్యాదేవిశరీరంబునందలి శోకంబు వినాశంబు
నొందె నంత నిక్కడ.

941


చ.

జనకుని మిత్రవర్గమును సర్వవిధంబుల వీడు కొల్పి కా
ననమున కేగురాముని జనప్రియుఁ బాయఁగ లేక రక్తు లై
పనివడి పౌరజానపదవర్గము బల్విడి నమ్మహాత్ముని
న్వెనుకొని యెంతఁ జెప్పినను వీడక వోవుచు నుండి రత్తఱిన్.

942


తే.

సముదితుం డైనపూర్ణిమాచంద్రుమాడ్కి, రామభద్రుండు సాకేతరాజధాని
పౌరు లగువారి కెల్ల నుదారసద్గు, ణాబ్ధి గావున సత్ప్రియుండై తనర్చె.

943

రాముఁడు పౌరుల నూఱడించుట

క.

వనికిం జనవల దని చ, య్యన రాముఁడు వారిచేత యాచితుఁ డయ్యున్
జనకుని సత్యాత్మునిఁ గా, నొనరింపఁగఁ బూని నిలువ కొయ్యనఁ జనియెన్.

944


వ.

ఇవ్విధంబునం బోవుచు నారఘువంశశేఖరుండు వారి నందఱఁ గరుణాతరం
గితాపాంగవీక్షణంబుల నిరీక్షించి స్నేహయుక్తంబు లగుమంజులవాక్యం
బుల నిజపుత్రులం బోలె ననునయించుచు ని ట్లనియె.

945


తే.

చెలఁగి మీరలు నాయందు సలుపునట్టి, భక్తిబహుమానగౌరవరక్తులను వి
శేషముగ భరతునిమీఁదఁ జేర్పుఁ డింక, మామనంబున కదియె సమ్మద మొసంగు.

946