|
జనకజ తోడ రా నొకఁడె సంభ్రమి యై చనుచున్నవాఁడు గ
న్గొనుఁ డకటా విరించి కఠినుండు గదా తలపోసి చూడఁగన్.
| 721
|
తే. |
అతులితైశ్వర్యసారజ్ఞుఁ డగుచు యాచ, కులకు సకలేష్టఫలదాయకుండు నయ్యు
ధర్మగౌరవమునఁ జాల దండ్రివాక్య, మనృతముగ జేయఁ దలపోయఁడయ్యె నేఁడు.
| 722
|
తే. |
కాంక్షతోడ నేసాధ్విని గనుఁగొనంగ, నభ్రచరభూతముల కైన నలవి గాక
యుండు నాసీత నీక్షించుచున్నవారు, పురములోఁ గలపురుషు లందఱును నేఁడు.
| 723
|
తే. |
సురుచిరాంగరాగార్హయు శోణగంధ, సేవినియు నైనసీతను దాప మందు
మొనసి శీతోష్ణములు వర్ష మనవరతము, దీనతయును వైవర్ణ్య మొందింపకున్నె.
| 724
|
జను లందఱు రామునిఁ జూచి పలుతెఱంగుల విలపించుట
ఉ. |
ఇన్నితలంపు లేల మనుజేశ్వరుఁ డిప్పుడు సత్య మూఁది యా
పన్నశరణ్యు నీసుజనపాలునిఁ బల్కెడుఁ గాక యట్లు కా
దన్నను ధాత్రి నెంత కఠినాత్మకుఁ డైన సుతున్ సునీతిసం
పన్నునిఁ బాసి నిందలకుఁ బాల్పడి యొంటి మనం దలంచునే.
| 725
|
తే. |
పుడమి గుణహీనుఁ డైనను బుత్రు విడువఁ, డెందు జనకుఁ డేఘనుని యహీనవృత్తి
చేత సతతంబు జనము రంజింపఁబడియె, నట్టిరాముని విడుచునె యవనివిభుఁడు.
| 726
|
తే. |
దమము శీలంబు శ్రుతమును శమము దయయు, నానృశంస్యంబు ననెడు నీయాఱుగుణము
లననరత మీరఘుస్వామి ననఘచరితు,నింపు సొంపారఁగ నలంకరింపఁజేయు.
| 727
|
ఆ. |
అట్టి పుణ్యపురుషుఁ డడవికిఁ బోయిన, ఘర్మకాలశుష్కఘనజలాశ
యమున నున్నమీల యట్ల లోకము దుఃఖ, తప్త మగుచు భీతిఁ దల్లడిల్లు.
| 728
|
చ. |
ఇతఁడు జగత్కు జంబునకు నెంతయు మూలము సర్వభూతముల్
సతతము పుష్పపల్లవఫలంబులు గావున నీత్రిలోకస
మ్మతుపరిపీడనంబున సమస్తజగంబు విపన్నతం బరి
ప్లుత మగు మూలఘాతమునఁ బుష్పఫలోపగశాఖకైవడిన్.
| 729
|
మ. |
అతులోద్యానములన్ గృహంబులను మాన్యక్షేత్రవిత్తాదులం
జతురత్వంబునఁ ద్రోచి పుచ్చి మన మీసౌమిత్రిమాడ్కి న్సము
న్నతసౌహార్దము దోఁప నీరఘుకులోత్తంసంబువెంట న్సతీ
సుతవర్గంబులఁ గూడి పోద మిచటన్ శోకింపఁగా నేటికిన్.
| 730
|
మ. |
లలితైణాంకసమానవక్త్రుఁ డగునీరాముం డరణ్యావనీ
స్థలికిం బోయిన వెన్కఁ బాడఱినపద్మం బట్ల నిస్తేజ మై
ఖలచిత్తాకృతి నొప్పు నీపురములోఁ గైకేయి దా నొంటి వ
ర్తిలుఁ గా కేటికి నిచ్చట మన కసద్వృత్తిన్ బ్రవర్తింపఁగన్.
| 731
|