Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బితృప్రవాదశత్రువులు నగు కైకేయీదశరథులశాసనంబు మనంబునందైన
సంస్మరింపందగినయదియె యని పలికి వెండియు ని ట్లనియె.

540


క.

అనఘా వారలయభిషే, చనవిఘటటనబుద్ధి దైవసంకల్పమ యం
చని పలికెద వట్లైనను, ననవరత ముపేక్షణీయ మనుచుఁ దలఁచెదన్.

541


క.

విను మసమర్థుఁడు దైవం, బనుకొను సంభావితాత్ము లగువీరులు ద్రో
చి నడుతురుగాక దైవం, బని దానిప్రశంస సేయ రతిధీయుక్తిన్.

542


క.

ధర నెవ్వఁడు పౌరుషమునఁ, దఱిఁ గని దైవమును గడవ దక్షుం డగు న
ప్పురుషుం డాదైవముచేఁ, గరము నిరోధింపఁబడఁడు కాకుత్స్థవరా.

543


క.

దైవబల మెక్కుడో నృప, భావితుఁ డగుశూరవరునిపౌరుషమె ఘనం
బో వీక్షింపుము ధీవర, దైవపురుషశక్తితారతమ్యము దెలియున్.

544


క.

ఏదైవముచే నిప్పుడు, నీదగు సిరి పరులయందు నెఱపఁబడియె లే
డాదైవమును మదీయబ, లౌదార్యాభిహతమునుగ నరయుదు రార్యుల్.

545


వ.

దేవా యే నతిక్రాంతాంకుశవ్యాపారంబై విశృంఖలవృత్తి నభిముఖంబుగాఁ
జనుదెంచు మదబలోత్కటవేదండంబునుం బోలే టైముబును బౌరుషంబునఁ
గ్రమ్మఱించెద నదియునుంగాక.

546

లక్ష్మణుఁడు తాను రాజ్యమును రామునికి లోఁబఱతు ననుట

మ.

అనుమానం బొకయింత లేక రఘువర్యా నీదురాజ్యాభిషే
చనవిఘ్నం బొనరింపఁ బూని పటుదోస్సత్వంబుతో లోకపా
లనికాయం బరుదెంచెనేని పటుభల్లవ్రాతఘాతంబునన్
దునుమం జాలుదు నట్టినాకు నరనాథుం డెంత చింతింపఁగన్.

547


క.

రవికులవర ని న్నిప్పుడు, వివాసితునిఁ జేసినట్టివిమతులు గరిమం
దవిలి పదునాలుగబ్దము, లవిరళగతి నడవి నుండున ట్లొనరింతున్.

548


క.

జనవిభునకుఁ గైకేయికి, ననయవిధి న్భరతరాజ్యమందు మదిం బు
ట్టినదుర్భరాశ నస్మ, ద్ఘనబాహుబలాసిచేత ఖండింతు నొగిన్.

549


వ.

మహాత్మా మదీయం బైనమహోగ్రపౌరుషంబు విరుద్ధజనులకు దుఖంబుకొఱకు
నెట్లగు నట్లు దైవబలంబు సుఖంబుకొఱకుఁ గానేరదని యెఱుంగు మని పలికి
వెండియు లక్ష్మణుం డొకానొకప్పుడైన భరతునకు రాజ్యంబు లేమిఁ దెల్లం
బుగా బోధించుతలంపున ని ట్లనియె.

550


తే.

అనఘ చిరకాల మీవు రాజ్యంబుఁ జేసి, వనమునకుఁ బోవుచుండ నవ్వల భవత్సు
తులె ప్రజాపాల్య మొనరింపఁగలరు గాని, భరతునకు లేదు స్వాతంత్ర్య మరసి చూడ.

551