పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

గోన గన్నా రెడ్డి

3

గన్నారెడ్డి గోదావరిని సేనలతో దాటేసరికి మహాదేవరాజు దాటి గోదావరి తీరాన్నే అతివేగంగా దేవగిరికి ప్రయాణం సాగించాడు.

గన్నారెడ్డి వచ్చి గౌతమిలో తేలిపోవు నావలను పట్టించియు, తన నావలను తెప్పించియు చక్రవర్తిని దాటింప ఏర్పాటుచేసి తాను ఇరువదివేల అశ్వికబలాలను తీసుకొని యాదవ మహాదేవప్రభువును ఆటంకపెట్టుటకు ముందుకు పోయినాడు. మల్యాల సేనలకు, గోదావరీతీరాన్నే ఎగువకువచ్చి గోదావరి దాటవలసిందని వేగు పంపి హుటాహుటి అతివేగంగా వెడలిపోయినాడు.

తెల్లని రూపసంపదచే ఉచ్చైశ్రవమునకు బిడ్డయనదగిన యవనాశ్వముపై అశ్వినిదేవతవలె గన్నారెడ్డి పోవుచుండగా విశాలాక్షప్రభువు అతనికి జంటగా ఇంకొక తెల్లని కాంభోజాశ్వముపై వెన్నంటి యేగుచుండెను.

గన్నారెడ్డి, విశాలక్షప్రభువు యువతి అని గ్రహించాడు. ఆమె అన్నాంబికాదేవి అని గ్రహించాడు. మొదటిసారి విశాలాక్షప్రభువు తనకడకు వచ్చినప్పుడే అనుమానము కలిగెను. రెండవసారి వచ్చినప్పుడు అనుమానము తీరి నిజము పూర్తిగా గోచరించినది.

ప్రేమ ఎంతపనిచేయును! ఈ బాలిక వరదారెడ్డిని ప్రేమింపనందున ఆదవోనినుండి పారిపోయివచ్చినది. తానును ఆమెను ఎత్తుకపోయి పెళ్ళియాడ సిద్ధముగానుండ ‘రోగి పాలుగోరిదాడు, వైద్యుడు పాలుకోరినా’ డన్నట్లు ఆమెయే తనకుతానై వచ్చినది. ప్రపంచములో ఇంతటి సుందరాంగి ఉండనే ఉండదు. దేశాలు సంచరించిన తన కది స్పష్టమే, సర్వవిద్యలయందు ఆరితేరిన ప్రోడ. భయమెరుగదీ బాల. యుద్ధవిశారద. పురుషవేషమునగూడ ఈ బాలిక ఎంత దివ్య సౌందర్యముతో విరాజిల్లుచున్నది! ఆమె స్వారిచేయుట ఆకాశములో హంస ఎగురుచున్నట్లే. ప్రాణాలకు వెరువక యుద్ధములో అతిరథ శ్రేష్ఠునిలా తనకు కవచరక్షణ చేసే ఈ మనోహరాంగి బాలికయని తా నెరిగినట్లు ఆమెకు తెలియకూడదని, ఆమెను చిన్నవయస్సనే వంకతో ఇంటికి వెళ్ళిపొమ్మని ఎంత బ్రతిమాలినను విన్నదికాదు. సరికదా కోపముతెచ్చుకొని బాధనంది విచారముతో క్రుంగి పోయినది. తా నది చూడలేక తన సేవచేయుటకు అనుమతి ఇచ్చినాడు. ఆమె ఖడ్గయుద్ధము, ధనుర్యుద్ధము అసదృశములు.

పురుషుడుకాని స్త్రీకాని మారువేషాలు వేసికొని కొన్నిదినాలు మాయపెట్ట గలరు. ఆమె తనకడకు వచ్చిన మూడవదినాన కృష్ణానదిలో ఈదుటకై తా నామె బాలకుడే యనుకొని, బుజముచుట్టు చేయివేసి నదివైపు లాగినప్పు డామె ముడుచుకొని పోయినది. చిరుమీసాలతో సొంపుగా ఉన్న ఆమె మోము కందిపోయినది. తన ఒళ్ళు ఝల్లుమన్నది. పురుషుని ముట్టినచో ఒళ్ళు ఝల్లుమనునా?