పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివదేవయ్య

279

దేశికుని గంభీరవచనాలు విని ఉప్పొంగి, రుద్రదేవి దేశికునకు పాదాభివందన మాచరించి వెడలిపోయినది.

ముమ్మడమ్మ గురువులకు నమస్కరించి ‘చక్రవర్తికి కలిగిన అనుమాన మేమిటి? అది గురువుగా రెట్లా తీర్చారు? వారి సంభాషణ ఇంచుకంతయినా తనకు బోధపడకపోయినదేమి?’ అనుకుంటూ రుద్రదేవి వెనుకనే తన గుఱ్ఱం నడిపించుకుంటూ వెళ్ళినది.

4

గోనగన్నారెడ్డి యాదవుణ్ణి సంపూర్ణనాశనంచేసే ఎత్తులు ఆలోచిస్తూ తాను విడిదిచేసిఉన్న ఒకపల్లెటూళ్ళో గ్రామణి ఇంట్లో మండువాలో పచారుచేయుచూ ఉన్నాడు. అతని కోలమోము, సోగమీసాలు, విశాలమైన కన్నులు, వెడదనుదురు ఆలోచనారేఖలతో బిగిసివున్నవి.

అప్పుడే ద్వారపాలకుడువచ్చి “మహారాజా! విశాలాక్షప్రభువు వేంచేసినాడు” అని మనవిచేసినాడు.

“ఏమిటీ! విశాలాక్షప్రభువా? రానీ?” అన్నాడు గన్నారెడ్డి. అతని హృదయం సంతోషంతో ఉప్పొంగింది. ఈ బాలుడు తన హృదయం చూరగొన్నాడు. ఆ బాలకునియందు వాత్సల్యం, సౌందర్యం, మైత్రి అన్నీ కలిసిన ఏదో ఒక దివ్యానురాగం కలిగింది. తెలివైనవాడు, చదువుకొన్నవాడు, ఉత్తమ వీరుడు. కాని మాటలో, కంఠస్వరంలో కొన్ని కొన్ని విషయాలలో బాలికలా అయి ఊరుకుంటాడు. ఆ చిన్న చేతులు అంత మృదువులేమి? కాని కత్తి పట్టుటలో అఖండ ప్రజ్ఞ చూపిస్తాడు. మగవీరులులా కనబడే స్త్రీలు, మగరాయని పనులు చేసే స్త్రీలూ, బాలికలలా ఉండేబాలురు ఉంటారు కాబోలు.

అతని బాల్యమూ, అతని లేతదనమూ చూచి, తనకు ఆ బాలకుడంటే అంతప్రేమ కుదరడానికి కారణం అయింది.

ఇంతలో విశాలాక్షప్రభువు పటాటోపంగా లోపలికి ప్రవేశించి, “మహారాజా! నమస్కారము” అని గన్నారెడ్డి పాదాల కెరగినాడు. మహారాజు విశాలాక్షరెడ్డిని గ్రుచ్చిఎత్తి రెండుభుజాలమీద చేయివేసి సంతోషంతో “విశాలాక్షప్రభూ! నన్ను మర్చిపోయావే అనుకున్నాను. కాని నీ రెండు కమ్మలూ నాకు చాలా ఆనందం చేకూర్చాయి. ఆ ఉత్తరాలలోని మాటలు కాదుసుమా!”

విశా: మరి దేనికి మహారాజా!

గోన: నేను దేవుణ్ణనీ, దేవుని తమ్ముని కుమారుడననీ పొగడితే మాత్రం కష్టంగాఉంది ప్రభూ!