పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

గోన గన్నా రెడ్డి

కొండలపై ఉండేది. కాబట్టి గోళకి మఠము అని పేరు తెచ్చుకున్నది. ఈ పాశుపతమతము శుద్ధశైవము. శుద్ధశైవమతానికీ వీరశైవమతానికీ చాలా తేడాలుండేవి.

శివదేవయ్య దేశికులు మహాకవి. తెలుగు నుడికారం అమృత ప్రవాహాలు కట్టే ‘పురుషార్థసార’ మను నీతిగ్రంథం రచించారు. ఈ మహాభాగుని గురించే తిక్కన మహాకవి,

“వసుమతీనాథ యాత డీశ్వరుడుగాని
 మనుజమాత్రుడు గాడు పల్మాఱు నితని
 యనుమతంబున నీవు రాజ్యంబు నేలు”

అని పాడియున్నారు.

విశ్వేశ్వరశంభువు పరమశివునివలె గణపతిదేవ చక్రవర్తి మహానగరం దాపున నిర్మింపబడిన మఠమధ్యమందు అష్టస్తంభ మండపంలో బంగారు సింహాసనంపై వ్యాఘ్రాజనంపై అధివసించి జటామకుటకిరీటులై, రుద్రాక్షహారాలు ధరించి అపరశంభువై తేజస్సుతో వెలిగిపోతూ శైవవేదాంత రహస్యాలు శిష్యులకు సర్వకాలమూ ఉపదేశిస్తూ ఉండెను.

విశ్వేశ్వరశంభువు శివసాయుజ్యం పొందినప్పటినుండి గోళకీ మఠానికి ఎనిమిదవ గురువు శివశంభువు అయ్యెను. ఈయన ఎన్నో దానశాసనాలు త్రిపురాంతకాది దివ్యక్షేత్రాదులయందు వేయించినాడు.

మహాదేవరాజు సకల భారతావనికీ తలమానికమైన ఓరుగల్లు మహాపురాన్ని ముట్టడించినాడన్న మొదటివార్త తెలిపిన తన శిష్యునకు బంగారు తాపడం చేసిన నూటఎనిమిది పంచముఖ రుద్రాక్షలుగల తావళాన్ని శ్రీ శివదేవయ దేశికులవారు బహుమానమిచ్చినారు. ఇది శుభవార్తయా అని ఆ శిష్యుడు సందేహించాడు. ఆ శిష్యుని మోముపై ప్రత్యేకమైన ఆశ్చర్యకాంతులు పరిశీలిస్తూ శివదేవయ్య దేశికులు చిరునవ్వు నవ్వి.

“ఆశ్చర్యం ఎందుకోయీ! యాదవులు కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తడానికి ఇదే తుది పర్యాయం. ఇంకొక్క నూరు సంవత్సరాలవరకు ఈ మహానగరంపై ఎవ్వరూ దాడిచేయలేరు” అన్నారు.

శిష్యుడు: మహాదేవరాజు దండెత్తకుండా ఉంటే?

శివ: ఇంక నెవరో ఒకరు దండెత్తి తీరుదురు. ఈ పట్టు ఈ మహా నగరాన్ని ఇంకొకరు ముట్టడిస్తే ఈ నగరప్రాణం కడగట్టుతుంది.

శిష్యుడు: ఎన్నాళ్ళు జరగగలదు గురుదేవా?

శివ: ఎన్నాళ్ళు జరిగినా భయంలేదు. విరోధికి ముట్టడి సాగినకొలదీ నష్టం.

శిష్యు: అది అనుభవ విరుద్ధముకాదా దేవా?