పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివదేవయ్య

273

శివ: అనుభవ విరుద్దం అంటావేమి? నీ కేముంది అనుభవము? ఎన్ని ముట్టడులు చూచావు?

శిష్యుడు: ముట్టడులనుగూర్చి విన్నాను గురుదేవా.

శివ: ఓయి వెఱ్ఱివాడా! ముట్టడించినవాడు, ముట్టడింపబడువానికి, లోకువ. ఆతని బలం ఎక్కువ నాశనం అవుతూ ఉంటుంది. అదిన్నీగాక తన దేశం వదలి ఎంతోదూరం వచ్చి ఉండడంచేత ఎక్కువనష్టానికి పాలవుతాడు. అలాంటివాణ్ణి ఓడించి తరమగలిగితే, వాడు మరెప్పుడూ తలెత్తుకోలేడు.

శిష్యు: చిత్తం!

శివ: చిత్తమేమిటి వెఱ్ఱివాడా! రాజకీయాలు అతిగహనంగా ఉంటవి. మల్యాలగుండయ కాటయల సేనలు అసాధారణాలు. అందరికన్న ప్రళయమే అయిన గోన గన్నారెడ్డి ధాటికి ఈ నీచుడు నిలువవద్దూ? అవన్నీ అల్లాఉంచి రుద్రమదేవి యుద్ధనిర్వహణశక్తి అప్రతిమానం. ఆమె అపరాజితా దేవి! ఆమె ధైర్యమూ, స్థైర్యమే కళ్ళారా చూడటము లేదటయ్యా!

శిష్యు: చిత్తం మహాప్రభూ!

శివ: ఇంకో రహస్యం ఉంది. ఇదివరదాకా శ్రీ రుద్రదేవ చక్రవర్తి విరోధులను, ఇతరులను ఓడించి నాశనం చేశారు. ఇప్పుడు ఈ చక్రవర్తినియే స్వయంగా యుద్ధనాయకత్వం వహించి, లోకానికి స్త్రీ శక్తి అకుంఠితమని చాట బోతున్నది. ఇంతటితో స్త్రీలు ఎందుకూ పనికిరారు. వారికి రాజ్యార్హతలేదని వాదించే శుష్క జీవుల మాట వ్యర్థం కాబోతున్నది.

శిష్యు: గురుదేవా! మూర్ఖుణ్ణి నాఅపచారం మన్నించండి.

శివ: నీ అపచారానికి ప్రాయశ్చిత్తము, నువ్వు శివభక్తులైన గణాచారులలో చేరి, కోట వెలుపలి వార్తలు నాకు తెలియచేస్తూ ఉండడమే!

2

శివదేవయ్యమంత్రి రథమెక్కి నగరరక్షణపు ఏర్పాట్లు ఎలాఉన్నాయో చూడడానికి వెళ్ళాడు. ఆయన భటులు, శిష్యులు, పండితులు, సేనాధికారులు కొలుస్తూఉండగా సరాసరిగ తూర్పుద్వారందగ్గరకు పోయినారు. అక్కడే పరాశక్తి అపరావతారమై పురుషవేషంతో, కవచాదులతో ఉత్తమాశ్వం ఎక్కి అంగరక్షకులు, ముఖ్య సేనాధికారులు, సచివులు కొలువ రుద్రదేవి దర్శనమైనది. అందరు తమ తమ వాహనాలు దిగి గురుదేవులకు నమస్కారంచేసి, ఆశీర్వాదాలు పొందారు. శ్రీ చక్రవర్తితో తంత్రపాలుడు ప్రోలరౌతు ఉన్నాడు. ప్రోలరౌతు కుమారులు ఎక్కినాయుడు, రుద్రినాయుడు, పినరుద్రినాయుడు, పోతినాయుడు అనే నల్వురు