పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

గోన గన్నా రెడ్డి

పాలార్చి, దేశాన్ని నిష్కంటకం చేశాడు. ఆంధ్రసామ్రాజ్యానికి శిలావప్రమై నిలిచినాడు.

“ఈ మధ్య రాజేంద్రచోడుని ఓడించి, ఏఱువభీముని దాసోహ మనిపించి, కొప్పరుజింగని పారద్రోలి, సామ్రాజ్యంలో ఛిద్రాలను నాశనం చేశాడు. గజదొంగ అయినందుకు నిజంగా గజాలు వేలకొలది ప్రతి యుద్ధంలో అపహరించినా డా యువకప్రభువు. చక్రవర్తి సింహాసనం మ్రోల కోట్లకొలది బంగారురాసులు, రత్నరాసులు కానుక లర్పించినారు.

“అలాంటి మహావీరుడు నిజరాజ్యాన్ని చేపట్టి ఏలుకోవలసిందని శ్రీ చక్రవర్తి కోరదలచుకొన్నారు.

“ఇది ఒక విషయం. రెండవది: దక్షిణాన్నుంచి వచ్చిన ప్రళయాన్ని గన్నారెడ్డి అడ్డుపెట్టినారు కాని అంతకన్న మహత్తరమైన ప్రళయం ఉత్తరం నుంచి వస్తున్నది. దేవగిరి యాదవరాజు కృష్ణభూపతి మరణించాడు. ఆయన కుమారుడు మహదేవరాజు దేవగిరిపతి అయినాడు. తండ్రిమరణాన్ని ఎదురు చూస్తున్న మహదేవరాజు సర్వసన్నద్ధుడై ఉన్నాడుగనుక ఇక మన దేశంపై పడడానికి అడ్డుఏమీలేదు.

“అదీగాక ఆయన సింహాసనం ఎక్కిన దినాన కవీశ్వరులు ఆయన్ను పొగడుతూ ‘మహదేవరాజు వీరకంఠీరవుని ప్రతాపానికి భయపడి మాళవులు ఒక, బాలకుని, ఆంధ్రులు ఆడదాన్ని సింహాసనం ఎక్కించారు’ అని కావ్యాలల్లారట. పిల్లలను, ఆడవారినీ మహదేవరాజు ఏమీ చేయడట. కాని వారి వారికి రాజ్యార్హత లేదు. కాబట్టి వారి రాజ్యాలుమాత్రం తాను తన ఛత్రచ్ఛాయలకు తీసుకొని అనుగ్రహిస్తాడట.”

అని శివదేవయ్యమంత్రి చెప్పగానే ఒక్కసారిగా “మహదేవరాజును పిండి గొట్టండి. ఆంధ్రులు పిల్లులో, బెబ్బులులో చూపండి. రుద్ర చక్రవర్తికి జయ! జయ!, అని కోలాహలం వినబడింది.

13

కృష్ణవేణ్ణానది అందాలు, విలాసాలు అన్ని ఋతువులలోనూ గోన గన్నారెడ్డి సందర్శించి ఆనందపరవశుడు అయ్యేవాడు.

గన్నారెడ్డిని వీరాధివీరునిగా ఎంచి, చూపులతో, మాటలతో, చేతలతో పూజించే ఆ బాలునితో కలిసి నిప్పులు చెరిగే ఆ వేసవికాలపు సాయంవేళల గన్నారెడ్డి కృష్ణాతీరానికి వచ్చేవాడు. గన్నారెడ్డితోపాటు వంతులచొప్పున సైనికులు గూడ కృష్ణాతీరానికి వచ్చేవారు.

తొండమండల జైత్రయాత్రానంతరం చాలమంది వీరులు, నాయకులు, సేనాపతులు తమ తమ నాడులకు, గ్రామాలకు వెళ్ళిపోయారు. గన్నారెడ్డి