పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

233

ఆంధ్రసైన్యాల వేగ మప్రతిహతము. హిమాలయపర్వతపు లోయలనుండి పరవళ్ళెత్తివచ్చే గంగానదివలె తొండమండలముపై బడిన గన్నారెడ్డి ధాటికి నిలువలేక కొప్పరుజింగని సైన్యాలు చెల్లాచెదరైపోయెను. ఆ మహా సంగ్రామములో కొప్పరుజింగని బందీచేసి గన్నారెడ్డి రాజధనాగారము దోచినాడు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగకుండ యుద్ధము నెరవేర్చి, కొప్పరుజింగని కోరలు ఊడబెరికి, విషం పిండి, ముందు ఆంధ్రదేశముపై కన్నెత్తితే తొండమండలము సముద్రమట్ట మొనర్తునని ప్రతిజ్ఞచేసి అయిదువేల ఏనుగులతో, వజ్రవైడూర్యాది రత్నరాసులతో, ఏనుగులు మోయలేని బంగారు రాసులతో వానాకాలము రాకమున్నే తన రహస్యనగరం చేరెను.

గన్నారెడ్డి దుర్నిరీక్ష్యతేజస్కుడై సకల ధనరాసులతో, సర్వసైన్యాలతో తన నగరం చేరి సైనికులకు, నాయకులకు వెలలేని బహుమతు లిచ్చి కాకతీయ రుద్రదేవి సామ్రాజ్ఞికి పదిలక్షల ఫణాలు, రెండువేల ఏనుగులు, పదివేల గుఱ్ఱాలు, రత్నాలు కప్పముగా పంపించెను.

ఓరుగల్లు కోటలో రుద్రమహారాజు, శివదేవయ్యమంత్రి, బాప్పదేవుడు, ప్రసాదాదిత్య నాయకుడు గన్నారెడ్డి యుద్ధయాత్రలకు ఆశ్చర్యము పొందినారు. రుద్రదేవి సామ్రాజ్ఞి సకల భారతావనిలో కీర్తినందిన ఈ గజదొంగ విషయము ఆలోచింప పేరోలగమున రాకాచంద్రునిలా తేజరిల్లుచు పురుష సింహాసనాసీన యయ్యెను.

శివదేవయ్యమంత్రి లేచి, “శ్రీశ్రీ రుద్రదేవ మహాప్రభూ! గోన గన్నారెడ్డి గజదొంగ కావటం మన దురదృష్టమూ అదృష్టమూ కూడా! అలాంటి వీరుడు తమకు దక్షిణభుజంగా ఉండవలసినవాడు. ప్రజలు అతని పేరుచెప్పి దీపం పెట్టుకుంటారు. ఒక్కరైతు కష్టంలో ఉన్నాడని గన్నారెడ్డికి వార్త వెళ్ళినదా, ఆ రైతుఇంట ధనరాసులు కురిసినవన్నమాటే! బ్రాహ్మణుడు వ్యధపడుతున్నాడంటే అ వెంటనే గన్నారెడ్డి ఆ బ్రాహ్మణుని ఇంట కల్పవృక్షము పాతినాడన్న మాటే! ఎక్కడై నా మన సామంతుడెవరన్నా ప్రజలను పీడిస్తున్నాడంటే గన్నారెడ్డి స్వయంగా అక్కడ ప్రత్యక్షం. ఆ సామంతుడు క్షమార్పణ అర్పించాలి. ప్రజలఎదుట దోషిగా నిలబడాలి. లేకపోతే గన్నారెడ్డే ఆ సామంతుని ప్రజల ఎదుట మునికోలతో శిక్షించినాడన్నమాటే!

“ఏ మహాదేశానికై నా ఒక్కొక్కప్పుడు చిక్కులు సంభవిస్తూ ఉంటవి. గద్దె దిగే ప్రభువు ముసలివాడై, ఎక్కేప్రభువు బాలకుడై నప్పుడు ఈ ప్రళయం సంభవిస్తూ ఉంటుంది. శ్రీ రుద్రమహాప్రభువు పృథ్వి అదృష్టం వల్ల సింహాసనం అధివసించారు. ఆమె స్త్రీ అనే ఉద్దేశంచేత అనేకమంది సామంతులు రాజద్రోహులై నారు. వెంటనే ఈ మహదాంధ్రభూమి అట్టి ద్రోహులను గన్నారెడ్డి పట్టి