పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

213

చాళుక్య సామ్రాజ్యము అంతరించగానే, వారికి సామంతులుగా ఉన్న కందూరులోని తెలుగుచోడులు వర్థమానపురం రాజధాని చేసుకొని, విజృంభించారు. కల్యాణి, చాళుక్యుల సేనాపతి అయిన కాలచుర్యబిజ్జలుని హస్తగత మయినది. బసవని వీరశైవంవల్ల కాల్యచుర్యవంశం నశించి కల్యాణి నగరాన్ని తెలుగుచోడులు ఆక్రమించినారు.

వర్థమానపుర చోడులను గణపతిచక్రవర్తి పెదతండ్రి రుద్రదేవ చక్రవర్తి నాశనం చేశాడు. అంతట కల్యాణి చోడులు కాకతీయ సామ్రాజ్యానికి సామంతులైనారు.

గణపతిదేవచక్రవర్తి కాలంలో కల్యాణినగరాన చోడోదయుడు రాజ్యం చేస్తూఉండెను. అతనికి ఎంతకాలమునుంచో తాను స్వతంత్రుడై మహారాజు కావలెనని వాంఛ ఉండేది. బలవంతుడైన గణపతిదేవచక్రవర్తి ముసలివా డయినాడు. ఆయన పేరున ఆయనకుమార్తె రాజ్యం చేస్తూఉంది. ఇంతకన్న అదను ఏమి కావాలి?

చిన్న చిన్న సామంతులను చేరతీశాడు. గట్టి సైన్యం పోగుచేశాడు. తాను చక్రవర్తినన్నాడు. తనకు పశ్చిమాంధ్ర సామంతులందరూ కప్పము కట్టాలన్నాడు. సైన్యంతో వెళ్ళి కందూరు పట్టుకున్నాడు. ఆ చుట్టుపట్ల ఉన్న రాజ్యం అంతా ఆక్రమించాడు.

ఆ సమయంలో రుద్రమహారాజుకు, శివదేవయ్య మంత్రికీ చోడోదయుని దురంతం తెలిసింది. శివదేవయ్య దేశికులు, మహారాజు, బాప్పదేవుడు, ప్రసాదాదిత్యప్రభువు, జాయపసేనాని ఆలోచించి, కొద్దివారాలలో చోడోదయునిపైకి వెళ్ళడానికి నిశ్చయించినారు. కాని నెలలు జరిగి పోయినవి. చోడోదయుడు నిర్భయంగా విజృంభించిపోయినాడు.

ఇంతట్లో చక్రవర్తిసైన్యాన్ని ఒకదాన్ని చోడోదయుడు నాశనం చేయడం, గణపతిదేవ చక్రవర్తి కైలాసవాసి అవడం రెండూ జరిగాయి.

చోడోదయుడు విజయగర్వంతో రాజు బందీగా ఉన్నాడని మానువనాడు ఆక్రమించుకొని వర్థమానపురం ముట్టడించాడు. ఈ విషయం అంతా గోన గన్నారెడ్డికి వేగు వచ్చింది. గన్నారెడ్డి మండిపోయాడు. ఎందుకు చక్రవర్తి సైన్యాలు ఊరుకొన్నాయి? ఇన్ని నెలలు ఈ పామును పాలుపోసి పెంచారు! చక్రవర్తి సైన్యాన్ని నాశనంచేయగానే గోనమహానగరం ముట్టడించే మొనగాడ నయినా ననుకొన్నాడా ఈ కీటకము! అని గన్నారెడ్డి పెదవులు బిగించి నవ్వినాడు.

చోడోదయుడు ఆశ్వికశ్రేష్టుడని ప్రతీతి. అతడు తురగముమీదనే నిద్ర పోగలడట. తురగముమీదనే భోజనం చేయగలడట. ఆయన ఎక్కే గుఱ్ఱము ‘మహావాయువు’ అని పేరుగలది. మ్లేచ్ఛాశ్వాలలో మహోత్తమమైనది. ఆ తురం