పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

గోన గన్నా రెడ్డి

రాజకీయ వ్యవహారాలు పరిశీలించి, రుద్రమహారాజునో, చక్రవర్తినో దర్శించి మధ్యాహ్నామునకు తిరిగి ఇంటికి వేంచేసి అతిథి అభ్యాగతులతో ద్వితీయస్నానానంతరం భోజనంచేసి, సాయంకాలం వరకూ గ్రంథకాలక్షేపమూ, పండితకాలక్షేపమూ చేసి, సాయంకాలం రాచకార్యాలు పరిశీలించడం శ్రీ శివదేవయ్యదేశికుల అలవాటు.

“ఇంతకూ ఈరాజ్యానికి ఆపత్తువస్తే దేవగిరి యాదవులవల్ల రాగలదు. ఆ గజదొంగ గన్నారెడ్డి పుణ్యమా అని ఎంతమందో రాజద్రోహులు హతమారిపోయినారు. ఇంక ఆలోచించవలసిన విషయము ఒకటి ఉన్నది. తెరవెనుక ఉండి ఈ రాజ్యమంతా విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించే ఒక మహావ్యక్తి! ఆ వ్యక్తిఎవరో చూచాయగా తనకు గోచరించింది.

“కాని అంతమాత్రంచేత ఆయన్ను నాశనంచేయడానికి వీలులేదు. ఆ నిజా నిజాలు కూడా కొద్దిదినాలలో తేలుతవి.”

“యాదవులు ఎప్పుడు వచ్చి పడతారో? అందుకు ఈ రాజ్యం తట్టుకోవలసిఉన్నది. సామంతులలో ఇంకను కొందరు రాజద్రోహం చేయడానికి సిద్ధపడినవా రున్నారు. వారితోపాటు కాంచీపుర చోడమహారాజు, పాండ్యులు ఉన్నారు. వారివిషయం తేల్చుకోవడానికేగదా తాను రుద్రమహారాజును జైత్రయాత్రకు పంపించింది! అప్పుడు ఒక్కరూ ఈ మహారాజ్యంపై తిరగబడెడి సామంతులు గాని ఇతర రాజ్యాలవారుగాని లేకపోయారు.

“ఈ లోగా రుద్రమహారాజుచేత ఓరుగల్లుకోటను సర్వవిధాలా సిద్ధంచేయించడం, రుద్రమహారాజు వివాహం నిశ్చయంచేయడం ఇవి ముఖ్యకార్యాలు” అని శివదేవయ్య దేశికులు అనుకుంటూ తన మహానగరులోని సభామందిరానికి వచ్చీ రావడంతోనే, ఒక సేనాపతి వారి పాదాల వ్రాలి, “మహామంత్రీ! కల్యాణపుర చోడోదయుడు తాను స్వతంత్ర చక్రవర్తిననీ, తాను చాళుక్యరాజ్యమైన సకల కుంతల రాజ్యభారం వహించినాననీ, పశ్చిమాంధ్రావనీశులు కుంతల సామంతునకే కప్పము కట్టవలసి ఉంటుందనీ లోకమంతా చాటించినాడట” అని మనవిచేసినాడు.

“ఏమీ! చక్రవర్తి కాలంనుంచీ మనకు కప్పం కట్టే కల్యాణపుర చోడులు ఇప్పుడు మానివేస్తారేమి? ఈ మహాదక్షిణావని అంతా ఏకచ్ఛత్రాధిపత్యం వహించి రాజ్యం ఏలిన చాళుక్యుల రాజధానిలో చోడులు ప్రవేశించడానికి కారణం రుద్రచక్రవర్తి లేడనుకున్నారా? సరే, మీరు వెంటనేపోయి రుద్రమహారాజుతో ఈ విషయం మనవిచేసి అక్కడ ఉండండి. నేను ఇంతలో అక్కడకు వస్తున్నాను” అని శివదేవయ్య దేశికులు ఆ సేనాపతికి సెలవిచ్చినారు.