పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

199

మార్జవాడినుండి పానుగంటివరకు మహాసామంతుడుగా రాజ్యంచేసే జన్నిగదేవుడు చక్రవర్తిని ఎదుర్కొని గౌరవించాడు. ఆయన కుమారులైన అంబయదేవ మహారాజు, త్రిపురాంతకదేవ మహారాజు రుద్రమహారాజుపట్ల భక్తి వెల్లడించారు.

మహారాజు శ్రీశైలం, విక్రమసింహపురం, కంచి మొదలైనవన్నీ చూసుకుంటూ కర్నూలు వచ్చారు. కర్నూలునుండి ఆదవోని వెళ్ళినారు. ఆదవోనినుండి బుద్ధపురం, వర్థమానపురం, అక్కడనుండి కతిపయ ప్రయాణాలు చేస్తూ భీష్మ ఏకాదశికి తిరిగి ఓరుగల్లు నగరం చేరారు. దారిపొడుగునా మహారాజపథంవెంట సేనలకు చలువపందిళ్ళువేసి సామంతులు మహానగరంగుండా ప్రయాణం చేస్తున్నట్లే అనిపించారు సైనికులకు.

అన్నాంబిక దేశాలన్నీ చూస్తూ, దేవుళ్ళను కొలుస్తూ రుద్రమహారాజుకు కుడిభుజంగా సంచరించింది. అయినా ఆమెహృదయంలో ఏదోబాధ కుములుతూనే ఉన్నది. ఆమెకు ఏవిధంగానైనా తాను చూడవలెనని కోరిన ఒక వీరుడుమాత్రం దర్శనం ఈయలేదు. ఆ వీరు డేమిచేస్తుంటాడు? సకలాంధ్ర భూమండలమూ ఏలే చక్రవర్తితనయ ఎదుట ఆ గజదొంగ ఎలా పడగలడు?

ఆ గజదొంగే శ్రీ కోట భేతమహారాజులను విడిపించారు. ఆ వీరునకట్టి అవసరమేమి కలిగినదో! ఈలా గోన గన్నారెడ్డి ప్రభువు చేశాడనీ, వీరుణ్ణి తాను ఏదో ఉడతాభక్తిలా గౌరవించాననీ భేతమహారాజులు చెప్పినప్పుడు రుద్రమహారాజులు తనవైపు చూచి చిరునవ్వు నవ్వినా రెందుకో? ఆదవోని వెళ్ళినప్పుడు తండ్రి తన్ను చూడలేదు. తన కొమరిత కాలగతి నందినదని దుఃఖించి ఊరుకొన్నానని వారితో అన్నారట!

తనతల్లి ఎంత దుఃఖించింది! పౌరుషంగల రెడ్డి రాజకుటుంబమువారు ఏకష్టాలకైనా ఓరుస్తారు. తండ్రిచేసిన అవమానం రుద్రప్రభువు అర్థంచేసుకొని ఊరుకొన్నారు. ఆ ప్రభువుకు తానేమీ చెప్పకపోయినా అర్థం చేసుకొన్నారు.

రాజకుటుంబాలన్నీ ఇలా బాధపడవలసిందే! మనుష్యుడు తోటిమానవులను తనకు బానిసలుగా చేసుకోవాలనీ, సమస్తవైభవాలూ తానే అనుభవించాలనీ కోరుతూ ఉంటాడు. అప్పుడే ఈ ప్రళయాలు సంభవిస్తాయిగదా!

సాధారణ స్త్రీయే తానై, సాధారణజీవితం జీవించి, మన్నైపోయినా ఒకటే, లేక క్షత్రియకన్యయై రాజ్యానికి పోరే నాయకుని బిడ్డయి, భార్యై, తల్లియై వారి ఆవేదనలు తనకూ సంక్రమిస్తే తానూ ఆవేదనపడుతూ ఏకాలానికి తాను తండ్రిలేనిదిగా, విగతభర్తృకగా, బిడ్డలేని తల్లిగా అవుతుందో తెలియక ఏదో గౌరవం అని, ప్రాణాలు అరచేత పెట్టికొని, బడాయికో, భక్తికో దానధర్మాలుచేస్తూ శాసనాలు చెక్కిస్తూ జీవించినా ఒకటే!