పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

గోన గన్నా రెడ్డి

వచ్చి ఎన్నిసార్లు తాకినా, నాగదేవుని చక్రవ్యూహాన్ని బద్దలుకొట్టలేక పోయినాడు. దక్షిణమునుండి రుద్రదేవి ఎన్నిసారులో ఆ చక్రబంధనాన్నితాకి, దానిని చీల్చలేక వేలకొలదివీరులు కూలిపోవడంవల్ల వెనుకకు వెళ్ళవలసివచ్చింది. గొంకప్రభువు, గజనాథప్రభువుకూడా నాగదేవరాజు చక్రవ్యూహాన్ని ఏమీ చేయలేకపోయినారు.

ఇంతలో గన్నారెడ్డిప్రభుని వేగువారు దారిచూపిస్తుండగా శ్రీ కోట భేతమహారాజు తన సైన్యాలను పూర్ణిమవెళ్ళిన విదియనాటికి కృష్ణదాటించారు. అక్కడి నుండి వేగంగా ఉత్తరంగా ప్రయాణంచేస్తూ తన మేనమామ అయిన నతనాటి ప్రభువుల సహాయం చేసికొని భేతమహారాజు హుటాహుటి ప్రయాణంచేస్తూ ఇల్లింద గ్రామానికి తూర్పున రుద్రమహారాజు సైన్యంతో తన ఏబదివేల సైన్యముతో నతనాటివారి ముప్పదివేల సైన్యంతోనూ వచ్చి కలుసుకున్నాడు. ఈ మహాసైన్యం అంతా నాగదేవరాజు సైన్యాన్ని చుట్టుముట్టింది, ఆ దినమందు జరిగిన మహాయుద్ధం దేవాసురయుద్ధాన్ని జ్ఞాపకం చేసిందని ప్రజలందరూ చెప్పుకొన్నారు.

మరునాడు మధ్యాహ్నానికి బాప్పదేవుడు అతివీరావేశంతో నాగదేవుని చక్రబంధం ఛేదించి నాలుగువేలమంది వీరులతో విరోధుల నరుకుతూ, పొడుస్తూ మదగజం చెరువులోనికి చొచ్చుకుపోయినట్లు పోయి నాగదేవునితో ద్వంద్వయుద్ధానికి తలపడ్డాడు. ఒకచోట చక్రవ్యూహం నాశనం కాగానే, ఆ బంధం నాలుగువైపులా విచ్ఛిన్నమైంది. రుద్రమహారాజు మహాశక్తివలె తన రథాన్ని తోలించుకుంటూ అంగరక్షకులతో వ్యూహమధ్యమునకు చొచ్చుకుపోయింది.

అటునుంచి గొంకప్రభువు, రేచెర్ల గణపతిప్రభువు చొచ్చుకువచ్చారు. భేతమహారాజు మరొకవైపునుంచి వచ్చాడు. ఈలోగా బాప్పదేవుడు మహాగరుడుడు మహానాగాన్ని చీల్చినట్లుగా నాగదేవరాజును నూరుబాణాలతో రథంమీద నిర్జీవుని చేసి పడవైచెను.

“జై గుంటూరి నాగదేవ తలగొండుగండ! జై పడికము బాప్పదేవా! జై రుద్రమహారాజా!” అని విజయధ్వానాలు మిన్నుముట్టాయి.

14

మహారాజు వేగంతో ప్రయాణంచేస్తూ ఉండిరి. ధరణికోటలో ముమ్మడాంబిక వచ్చి మహారాజును కలుసుకొన్నది. ఎక్కడికి రుద్రమహారాజు వెళ్ళినా అక్కడ సామంతులు మహాగౌరవంతో మహారాజును ఎదుర్కొని అఖండోత్సవాలు చేస్తూ ఉండిరి. కోట పేర్మాడిరాయుడు మహారాజు ఎదుట మోకరించి క్షమాభిక్ష వేడుకొన్నాడు. తెఱాల కాటయ్య కీటకమే అయిపోయినాడు.