పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

197

పాకనాటి సామంతుల ఓడించడం విషయంలో ఎంతో యుద్ధనిర్వహణ దక్షత చూపించి చక్రవర్తివల్ల ఎంతో మెప్పుపొంది ఉండటంవల్ల, తన సహాయంవల్లనే చక్రవర్తి ఇన్ని విజయాలు సంపాదించాడనే అభిప్రాయం అతని హృదయంలో హత్తుకు పోయింది.

ఒకవేళ చక్రవర్తిలో ఏమన్నా శక్తివుంటే, ఆయన కొమరితకు ఆశక్తి ఎట్లా ఉండగలదు? ఇదే మంచి అదను. తానా వ్యూహనిర్వహణ చతురుడు! తనకు కలిగినట్లే ఇతరులకు స్త్రీ సామ్రాజ్యంలో ఉండడానికి కష్టం కలిగిఉండాలి. ఇంకనేమి? అతను అతిధీమాతో, నమ్మకంతో ఓరుగంటిని ముట్టడించడానికే బయలుదేరాడు. ఒకసారి ఓరుగల్లు పట్టుకొని సామ్రాజ్యాభిషేకం పొందితే తన్ను కదిలించడానికి ఆ వీరభద్రునికి కూడా తరంకాదు.

గుంటూరు నాగదేవరాజు పూర్ణిమవెళ్ళిన తదియనాడు కృష్ణదాటాడు. ఇక్కడి నుండి పంచమినాటికి నతనాటిసీమకు ఉత్తరపుభాగంలో ప్రయాణం చేస్తూ సప్తమినాటికి గార్లకు తూర్పుగా పదిగవ్యూతుల దూరంలో విడిదిచేసి ఉన్నాడు. ఒకవేళ గార్ల మండలేశ్వరుడు, శ్రీ రేచెర్ల గణనాథుడు ‘మీరు ఎక్కడికి, ఎందుకు వెడుతున్నా’ రని ప్రశ్నిస్తే ‘ప్రసిద్ధికెక్కిన మంత్రకాళేశ్వరము దర్శించడానికి వెడుతున్నా’ మని చెప్పవచ్చును అని నాగదేవరాజు అనుకొన్నాడు.

అపసర్పనాథులలో మహోత్తమవిద్యాసంపన్నుడైన గొంకప్రభువు నాగప్రభువు యాత్రవిషయం అడుగడుగూ తెలుసుకుంటూనే ఉన్నాడు. ప్రతిక్షణికము వార్తలు రుద్రమహారాజుకు అందిస్తూనే ఉన్నాడు. రుద్రమహారాజు పడికము బాప్పదేవుని, గొంకప్రభువును పిలిచి వర్థమానపురం విడిదిలో యుద్ధవిధానం మంతనము సలిపినాడు. ఆమె అంగరక్షకుడగు ఆ యువకుడు కూడా ఆ మంత్రాంగంలో పాల్గొన్నాడు.

తమ లక్ష ఇరువదివేల సైన్యమూ మూడుభాగాలుచేసి, ఏబదివేల సైన్యం నడిపించుకొని తాను గాళ్ళపైనుండి ఉత్తరంగావచ్చి నాగదేవుణ్ణి తాకుతాననీ, రుద్రమహారాజులు ఏబదివేల సైన్యంతో దక్షిణంగావచ్చి అతన్ని తాకవలసిందనీ, గొంకప్రభువు ఇరవైవేల సైన్యంతో గార్ల వెళ్ళి, అక్కడ రేచెర్ల గణనాథ ప్రభువు సైన్యముతో కలిసి పడమటగా వెళ్ళి నాగయ్యను మార్కొన వలసిందనీ, ఇదివరకే వేగులుఅందిన గాళ్ళప్రభువు నాగదేవయ్య పారిపోకుండా ఇట్లా చేయవలసిందనీ పడికము బాప్పదేవుడు సలహా ఇచ్చాడు.

నవమివెళ్ళిన దశమినాడు ఏమరుపాటున ఉన్న నాగదేవయ్యను మూడువై పులనుండి మూడు సైన్యాలు తాకినాయి. వెంటనే నాగదేవరాజు తన సైన్యాలను చక్రవ్యూహము రచించి నెమ్మదిగా తూర్పుకు తిరోగమింప జేయసాగినాడు. నాగదేవరాజు మంచివీరుడు, యుద్ధనిపుణుడు. పడికము బాప్పదేవు డెంతవేగంగా