పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

గోన గన్నా రెడ్డి

నందుకు యెంతో ఆనందంగా ఉన్నది. శ్రీ స్వయంభూదేవుల పరమకరుణ! మహారాజా! గుంటూరి నాగయ్యప్రభువు విజయవాడకడ కృష్ణదాటి డెబ్బది అయిదువేల కాల్బలంతో, పదమూడువేల అశ్వికులతో, యేడువందల గజాలతో ఓరుగల్లును ముట్టడించడానికి సాగిపోతున్నారనిన్నీ, అటు ఓరుగల్లునుంచి శ్రీశ్రీశ్రీ కుమార రుద్రదేవ మహారాజులు, శ్రీ పడికము బాప్పదేవ మహారాజులు నాగదేవరాజును ఎదుర్కొనడానికి వస్తున్నారనిన్నీ వేగు. మహారాజులు, ఈ పేర్మాడి ప్రభువుకొరకు సిద్ధంచేయించిన పడవలలోనే ససైన్యంగా కృష్ణదాటి వెళ్ళి శ్రీ రుద్రమహారాజులకు సహాయం చేయవలసిందని కోరుతున్నాను. మా మహారాజు, మేమూ అనతిదూరంలో కృష్ణవేణ్ణకు ఈవలి ప్రక్క ఉండి, నాగదేవయ్యను హతమారుస్తాము. ఇక ఈ పేర్మాడిరాయ, కాటయనాయకుల విషయంలో శ్రీ మహారాణీవారి అభిప్రాయం విన్నాను. ఈ పేర్మాడిరాయని రాజకంఠాభరణం నేను ఈ నిండు పేరోలగంలో భటులచే ఒలిపించి మా ప్రభువు కంఠాభరణం చేసెదను గాక. ఈ కాటయ్యనాయకుడు మోకరించి తమ పాదాలు, మా ప్రభువు పాదాలు అంటాలి. తమ తమ సైన్యాలు మహారాజులకు అప్పగించి తమ తమ మండలాలకు వీరు వెళ్ళుదురుగాక. ఇక్కడినుండి మహాప్రభువులకు వారు మూడేళ్ళవరకు రెట్టింపు కప్పము కట్టుతూ ఉంటారుగాక. ఇప్పుడు అపరాధంగా పేర్మాడిరాయ ప్రభువు మహాప్రభువులకు ఆరులక్షల టంకాలు, మాకు రెండులక్షల టంకాలు, కాటయ్యనాయకులు మహాప్రభువులకు లక్షటంకాలు, మాకు ఇరువదివేల టంకాలు బంగారము తప్పు చెల్లింతురుగాక’ అని సవినయంగా మనవిచేశాడు.

సభ్యులందరూ హర్షధ్వనులు చేసినారు. శ్రీ కోట భేతమహారాజులంవారు అతిసంతోషంతో చినఅక్కినప్రగడ ఆలోచన అంగీకరించారు. భేత మహారాజులు తమ మెడలోనున్న నాయకమణిహారం గోన గన్నయ్య మెడలో వైచి, విఠలధరణీశునుకి తమ ముత్యాలహారం అర్పించారు.

పేర్మాడిరాయని రాజకంఠాభరణం మంత్రులు తీసి గోన గన్నయ్యకు అర్పించారు. కాటయనాయకుడు సింహాసనంఎదుట మోకరించి తల భూమిపై వాల్చినాడు.

13

గుంటూరు నాగమహారాజు కోట భేతమహారాజులంవారికి ముఖ్య సామంతుడుగానూ, గణపతిదేవ చక్రవర్తికి నమ్మకమైన సేనాపతిగానూ ఉంటూ ఉండెను. కాని చక్రవర్తి అవసానదశలో ఉండడమూ, రుద్రమహారాజు స్త్రీ కావడమూ, అతని హృదయంలోనూ దుర్బుద్ధి పుట్టించింది. అదివరకు గణపతి చక్రవర్తితో కలిసి కమ్మనాటి, ఆరువేలనాటి, సిందవాడివిషయం