పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

185

వానికి తప్పకుండా వస్తాను. ఎల్లుండి మా బావగారు ఇక్కడ నేను ఉంచే మూడువేల సైన్యాన్ని నడుపుకుంటూ ఒకచోటికి వెళ్ళాలి. ఆయన యుద్ధానికిరారు. ముహూర్తం మూడుదినాలుండగా ఇక్కడకు వస్తాడు. ముహూర్తం నాటికి మేమందరమూ వస్తాము. ఈలోగా మీరు నిర్భయంగా ఉండండి. ఏమీ భయపడవలసిన అవసరంలేదు” అని మాచనమంత్రికి పాదాభివందనమాచరించి, వా రాశీర్వదిస్తూ ఉండగా వీధిలోనికి వెళ్ళి అక్కడొక వీరభటుడు సిద్ధంచేసి ఉన్న గుఱ్ఱంపై చంగున ఉరికి, సహచరులు కూడరా గోన గన్నారెడ్డి సాహిణి వెళ్ళిపోయినాడు.

అక్కినప్రగడ ఆలోచనతో లోనికివచ్చి తిన్నగ మేడమీద తన గదిలోనికి పోయినాడు. అతడు అక్కడ ఒక బల్లమీద పరిచిన రత్నకంబళిపై కూరుచుండి దిండ్లనానుకొని ఆలోచనానిమగ్నుడై ఉండెను. మనుష్యుల ఆశకు అంతేమున్నది. పేర్మిడిరాయనికి చక్రవర్తి కావలెననే! దుర్మార్గులు! శ్రీ శ్రీ గణపాంబదేవి భర్త తెలివైన మహారాజేకాని ముందుచూపు లేనివాడు. కృష్ణార్జునుల ఏకరూపమైనవాడు తన ప్రభువు, గన్నారెడ్డి? కాని ప్రభువు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

ఈ మహాపురుషుడు తనకు వివాహం వలదంటాడు. అధర్మం అణచడమునకే తాను పుట్టినాడట. దేవునినామం ధరించినందుకు ఆయన ఆజ్ఞపరిపాలించడమే తన విధి అట. ఆయన వెన్నదొంగ, ఈయన గజదొంగ. తమలో స్త్రీవాంఛ లేదట. తనకున్న ప్రేమంతా స్నేహితులకూ, సైనికులకూ, ప్రజలకేనట. స్త్రీ తన కవసరము లేదట?

ఈ మాటలు నమ్ముటెట్లు? ఆయనజాతకంలో సప్తమస్థానమూ, స్థానాధిపతీ, శుక్రుడూ మంచిస్థితిలో ఉన్నారు, ఇంక వివాహం ఎలా తప్పించుకుంటాడు?

అక్కినప్రగడ సేనలను గూర్చుకొని యుద్ధాభిముఖుడై వెళ్ళుదునని చెప్పగానే కామేశ్వరి గజగజ వణికింది. ఆమె కన్నుల నీరుతిరిగింది.

‘కామేశ్వరి! అలా కంటినీరు పెట్టకు. మహావీరుడు ఖడ్గతిక్కన చరిత్ర వినలేదా? నన్ను ఆడదానిలా ఇంట్లో కూరుచుండమంటావా? మగువ మంచాలవలె,

“నాతో బెనంగిన నయమేమిలేదు
 కడువడిఁ గలనికిఁ గదలండి మీరు,
 కుల వైరముం దీర్ప గురుసాహసుండు
 పరికించిచూడ నెవ్వరు మీరుదక్క”

అనాలి. ఆమె ఇంకా ఏమిచేసిందో తెలుసునా, ఆయన కటారితెచ్చి చేతికిచ్చి,

“రతిరాజ్యసౌందర్య! రణరంగధీర
 కమలబాంధవతేజ! కరుణాలవాల