పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

గోన గన్నా రెడ్డి

తలుచుకోకుండా తనజ్ఞాతి, చక్రవర్తిగారి అల్లుడు, ఆరువేల సీమాధిపతి అయిన శ్రీ కోట భేతమహారాజులం వారిపైకి, తెరాల ప్రభువు కాటయనాయకునితో కలిసి దండెత్తి వస్తున్నాడని తెలిసింది. మనకు మొదటవచ్చిన వేగులన్నీ వీరిరువురూ కలిసి మనపై కే వస్తున్నారని వచ్చాయి. అది పొరపాటు. మనం ఎక్కడున్నామో వాళ్ళిద్దరికీ సరిగా తెలియదు. అదీగాక మీ పినతండిగారి జైత్రయాత్రాపరిణామం అందరి హృదయాల్లో పిడుగులు కురిపించింది. కాబట్టి వీరిరువురూ ధాన్యకటకం మీదకే వెడుతున్నారు. ధాన్యకటకం దిగువను కృష్ణవేణ్ణను పడవలమీద దాటడానికి భేతమహారాజుగారి అనుజ్ఞ కోరితే ఆ వెఱ్ఱిమహారాజు సరేనన్నారు.

“అవునయ్యా బావా! చిత్రం ఏమీటంటే సైన్యాలన్నీ దాటేవరకూ తన జ్ఞాతికి భేతమహారాజు అఖండాతిథ్యం ఇవ్వ సంసిద్దుడైనాడట. నీకు వచ్చిన వేగు నిజమయితే వెంటనే మనం పేర్మాడిరాయని పేరు మాయిడి చేయించాలి. నువ్వు ‘అతివేగము’ అనగానే అతివేగంగానే వచ్చాను. నాతో ఉన్న సైన్యము అయిదువేలు. మా విఠలయ్య తక్కిన సైన్యంతో అటు పల్నాటి వైపునుంచి వచ్చి ఆ సైన్యాలను చుట్టుముట్టుతాడు. మూడువేలమందిని కృష్ణవేణి కీవల కాపుంచి, నాలుగువేలమందితో విజయవాడ దిగువ ఏరుదాటి నేను తమ్మునికి సహాయంగా వెడతాను. వాళ్ళిద్దరి సైన్యాలు భేతమహారాజు సిద్ధంచేసిన పదివేల పడవలలో దాటకుండా మన మూడువేలమంది సిద్ధంగా ఉంటారు. నువ్వుమాత్రం కదలడానికి వీలు లేదు. బావా! వస్తే కృష్ణ ఈవలి సైన్యాలకడకు రావచ్చును. అంతే! ఇది నా ఆజ్ఞ, బహుశః నీ పునస్సంధాన ముహూర్తంనాటికి వాళ్ళిద్దరి వ్యాపారమూ చక్కబెట్టి వస్తాను. వచ్చితీరుతానులేవయ్యా, అల్లరిపెట్టకు మీ తాతగారు వస్తారో, రారో?” అని గన్నారెడ్డి లేచి, ‘బావగారూ నేను బాబయ్యగారితో చెప్పి వెళ్తున్నాను’ అన్నారు.

“నేను మీతో వచ్చి యుద్ధంలో పాల్గొనరాదనే ఆజ్ఞా?”

“ఆజ్ఞే! ఉల్లంఘించడము పనికిరాదు. వస్తే కృష్ణ ఈవలకు రావచ్చును.”

“అక్కడికే వస్తాను.”

“మా బాబయ్యగారి అనుమతి అడిగిరావాలి మరి!”

“అనుమతి అడిగితే ఇస్తారా?”

“అయితే ఒక పని చేస్తాను. మూడువేల సైన్యాలు ఇక్కడే ఉంచి, నేను వెళతాను. నువ్వు ఎల్లుండి బయలుదేరి రా!”

అక్కినప్రగడ లేచి, వెంటనే లోనికివెళ్ళి మేనమామ మాచనమంత్రిని తీసుకొని వచ్చాడు. మాచనమంత్రికి గన్నారెడ్డి లేచి నమస్కరించి ‘బాబయ్యగారూ! నేను వెంటనే వెళ్ళిపోవాలి. పునస్సంధాన మహోత్స