పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

గోన గన్నా రెడ్డి

మేనల్లుణ్ణయి, సోమయామాత్యుల కుమారుణ్ణయి అధర్మకార్యం ఒకటీ చేయనని మాత్రం నమ్ము. అధర్ముని కొలువులో ఉండను. నేను ద్రోహిని కాను. మా ప్రభువు రామచంద్రప్రభువు అవతారము. అంతకన్న ఎక్కువ నేను వాదించను. ఇక వచ్చిన పని మిమ్ముల నందరినీ చూచి చాలాదినాలైనది. ఒక్కసారి అత్తయ్యను, మరదళ్ళను, మరదులను చూడాలనీ, దీవెన అందుకోవాలనీ.

మాచన: (కన్నులనీరు గిర్రున తిరిగితే, ఉత్తరీయాన తుడిచికొని) నాయనా! మీ అమ్మ ధైర్యమేమిటో చెప్పలేను, నీ విషయం ఏమీ అనుమానం లేకుండా ఎప్పటి రీతిగా ఆనందంగా ఉంది. కాని మీ తాతగారు నీ విషయంలో ఉగ్రుడై ఉన్నాడు. నీ పేరెత్తితే మండిపోతారు. నీమీది కోపం అంతా నామీద చూపించారు. మీ నాన్న ఏదో నిన్ను తలుచుకొని విచారిస్తాడు. కోపం మాత్రం లేదు. మీ అమ్మ బావను గట్టిగా చివాట్లు పెడుతూ ఉంటుంది.

అక్కిన: మా అమ్మ అచ్చంగా పార్వతీదేవి. నాన్నగారు తమ కుమారు డంటే అంత అనుమానం ఎందుకుపడాలి?

మాచన: అవన్నీ అలాఉంచు! కామేశ్వరిని చూచావా?

6

ఉద్ధండ పండితులను లెక్కచెయ్యని అక్కినప్రగడ సిగ్గునంది చిరునవ్వు మోమును ప్రపుల్లం చెయ్యగా ‘చూచాను మామయ్యా! బాగా చదువుకుంటోందా?’ అని ప్రశ్నించాడు.

“అక్కినా: నీ భార్య చదువుకోదా! నీకు తగినభార్య కావద్దూ? పంచ కావ్యాలు చదువుకుంది. అలంకార శాస్త్రాలు, వ్యాకరణమూ చదువుకుంటున్నది. లే! స్నానంచేసి సంధ్యావందనం చేసుకో,”

“ఊరిబయట వాగులోముగించుక వచ్చాను. కాని మళ్ళీ స్నానంచెయ్యాలి.”

‘అమ్మడూ, సీతా? బావకు స్నానానికి నీళ్ళు తోడించమ్మా వంటలక్క చేత' అని మాచయమంత్రి కేక వేసినాడు.

సీతమ్మ ఈవలకు పరుగునవచ్చి ‘బావకు పన్నీరు తోడించా నాన్నగారూ!’ అంటూ అక్కినప్రగడవైపు తిరిగి, ‘రావయ్యా బావా! నీ సామాగ్రి అంతా నీ సేవకులుకాబోలు పట్టుకువచ్చారు. మిద్దె గదిలో పెట్టించాను. మహానుభావుడవు! మా అక్క మాకే కనపడడం మానేసింది. పెళ్ళయి నాలుగేళ్ళయింది. ఇప్పటికా రావడం అత్తింటికి, మహాపండితుడుగారూ!’ అన్నది.