పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

173

సిగ్గు’ అన్నది. ఇంకొక ఇల్లాలు ‘అవును, కాబోయే మగడువస్తే సిగ్గుపడక నాట్యం చేయమన్నావా కామేశ్వరిని?’ అని తల తిప్పినది.

కన్ను గిలిపిస్తూ, కామేశ్వరి బుగ్గ గిల్లుతూ ‘ఓయమ్మా? ఎన్నాళ్ళకు వచ్చాడు? మంచిదినానే వచ్చాడు. కాని వస్తూ వస్తూ మూడు గడియలు ముందుగా ఎందుకు వచ్చాడుకాడు? కామేశ్వరి నాట్యం చేసే పరమాద్భుత సౌందర్యం చూచేవాడే!’ అని వారి దగ్గర చుట్టమైన బిడ్డలతల్లి అన్నది. వారందరూ మాచయ మంత్రి ఇంటికి చేరారు. సభాగృహంలో మాచయమంత్రీ, అక్కినప్రగడా మాట్లాడుకుంటున్నారు. వారి కుశలప్రశ్నలూ, ప్రతివచనాలూ అప్పుడే అయినవి.

బాలికలూ, స్త్రీలూ లోనికి వెళ్ళిపోయినారు. ‘బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నేరు, వీశెడు గంధం పూసేరూ, వీధీ వీధీ తిప్పేరు’ అంటూ సీతమ్మ లోనికి కలకల నవ్వుతూ పరుగెత్తింది.

మాచనమంత్రి చిరునవ్వు నవ్వుకొని, మళ్ళీ గంభీరుడై ఏమి అక్కినా! నువ్వా గజదొంగ జట్టులోనే ఉండి మాకుటుంబాలన్నీ తలెత్తకుండా చేస్తూ ఉండవలసిందేనా?’ అని ప్రశ్నించాడు.

“ఏమి మామయ్యా! ఇప్పటికి అయిదేళ్ళనుండి మన గజదొంగల సైన్యం పెరిగింది, పెరిగింది. ఇప్పుడు మా ప్రభువూ ఒక రాజ్యం స్థాపించారు. మేము ప్రజలను దోచుకోలేదు. గ్రామాలు కొల్లగొట్టలేదు. రాజ్యాలపేరిట అరాజకంనింపిన వాళ్ళను హతమార్చాము, హతమారుస్తున్నాము. హతమారుస్తాము. అది తప్పా!”

మాచన: అయితే ఎందుకు మీ గన్నయ్య చక్రవర్తిని శరణు వేడరాదు?

అక్కిన: మాకంత కర్మమేమి? మేమూ చక్రవర్తికి లోబడే ఉన్నాము. మేము చేసినదంతా ప్రజలను దోచేవారిని దోస్తున్నాము. దానివల్ల అధర్మమేమి కలిగింది? ఈ రెండేళ్ళనుండీ మా ప్రభువు చక్రవర్తికి కప్పం కట్టుతూనే ఉన్నవాడాయెను.

మాచన: దోపిడీసొమ్ము కప్పమా? ఏ ధర్మశాస్త్ర ప్రకారం అవుతుంది?

అక్కిన: (పక పక నవ్వుతూ) మామయ్యా! ధర్మశాస్త్రప్రకారం మా సొమ్ము ‘దోపిడీ సొమ్ము’ అని ఋజువు చేయవలసిన భారం నీది.

మాచన: అందరూ అంటున్నారు.

అక్కిన: అపవాదు ధర్మశాస్త్రంలో అనుమాన సాక్ష్యమే అవుతుంది.

మాచన: అబ్బాయీ! నువ్వు ఉద్దండ పండితుడవు. నీతో నేను వాదించి నెగ్గగలనా?

అక్కిన: నీ మేనల్లుణ్ణి కానా మామయ్యా? ఒక్కటిమాత్రం నమ్ము. ఇన్ని శాస్త్రాలు చదువుకొని, అక్కినమంత్రి మనుమణ్ణయి, మాచయమంత్రి