పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

169

ఓరుగల్లునగరంలో పెద్దకుటుంబాల స్త్రీలు, బాలికలూ అందరూ పేరంటానికి ఆహూతులైనారు. సాయంకాలం ఇరువది ఘడియలు కొట్టినప్పటినుండి పేరంటాండ్రు రుద్రదేవ రాజనగరుకు రథాలమీద, అందలాలమీద విచ్చేసినారు. వారు కట్టుకున్న పట్టుచీరలు, వారు ధరించిన రత్నాల ముత్యాల భూషణాల వెలుగులు మిలమిలలతో, జలజలలతో, తళతళలతో ఆ మందిర మంతా నిండిపోయాయి.

రుద్రదేవి బాలికగా వారి కందరికీ ప్రత్యక్షమగుట అదే మొదటిసారి. ఎంత అందమైనది! ఆమె ఫాలము ఎంత విశాలమైనది! ఆమె కన్నులలో సహస్ర పత్రకమలాలువికసించాయే! ఎంత తీయనికంఠ మీ రాజకుమారిది! సత్యభామ ఈలాగే ఉండేదా? ఈమెను ఈలా దర్శించడం ఎంతపుణ్యం చేసుకుంటే మనకు సంభవమైంది! శచీదేవి, లక్ష్మి, సరస్వతి ఈలాగే ఉంటారుకాబోలు! ఇదివరకు ఊరేగింపులలో మహాసభలలో దర్శించినప్పు డచ్చముగ సుందరుడగు బాలకునిలా కనపడి, ఈ రాజకుమారి, నేడు ఎంత ఠీవిగా, గంభీరంగా, సుందరిగా మనలను ఆహ్వానించింది! ఈలాంటి, ప్రశ్నలు వేనకువేలు ఆనా డక్కడ సమకూడిన ఆంధ్ర రాచభామల, నియోగిమంత్రిల అంగనల; పండితవంశ సుందరాంగుల హృదయాలలో మెరుములు మెరిసి పోయినవి.

ఈ ఉత్సవం చేసేది ముగ్గురు కన్యలు. రుద్రమదేవికన్య, ముమ్మడమ్మకన్య, అన్నాంబికకన్య. ఈ విషయం ఆ దినాన అక్కడకు పేరంటం వచ్చిన ఆంధ్ర కులాంగన లందరూ గ్రహించారు.

ఒకప్రక్క నృత్యగీత వాద్యాలూ, ఒకప్రక్క తీయని ఆంధ్ర యోషల పాటలూ ఆ మందిరమంతా లలితాదేవి దివ్యమందిరాన్ని చేసినవి.

చెలికత్తెలు బంగారు పళ్ళెరాల ముత్యాలు, వివిధ ఫలజాతులు, వివిధ పుష్పాలు, ఆకులు, వక్కలు, లవంగ, జాజికాయ, జాపత్రి, కస్తూరి, కుంకుమ, జవ్వాజి, పిస్తల, చార, ఆరోటు పప్పులు పట్టుకొని వెనుకరా రుద్రాంబ, ముమ్మడమ్మ, అన్నాంబలు వచ్చిన పేరంటాండ్రకు వాయినాలిచ్చేరు.

వేలకువేలు ఇతర స్త్రీ లా నగరిలో నిండిపోయినారు. వారందరికీ చెలులు రాచకన్నెలకు ఇచ్చిన వాయినాలవంటివే ఇచ్చారు. మంగళహారతులు పాడిన వెనుక ఎవరి నగరులకూ, ఇళ్ళకూ, వారు వారు వెళ్ళిపోయినారు.

ఆ రాత్రి రుద్రాంబిక నగరిలోనే ముమ్మడాంబిక భోజనము చేసినది. ఆ వెనుక వారు కావ్యవిచారణ చేసినారు. ముమ్మడమ్మ తన నగరికి వెడలిపోయినది. ఆ వెనుక ఆ మహానవమీ శారదజ్యోత్స్నలో రుద్రాంబ, అన్నాంబిక ఉప్పరిగపై కూర్చుండి ఆ అమృతాల వెన్నెలలో మునిగి తేలుతూ ఏవేవో స్వప్నలోకాలలో విహరించడం ప్రారంభించారు.