పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

గోన గన్నా రెడ్డి

4

వెన్నెలలో కూరుచున్నవారు ఈలోకమే మరచిపోతారు. దసరా దినాలలో వానలు కురియడం ఆంధ్రదేశంలో ఎక్కువ. ఆంధ్రబాలిక లా దినాలలో బొమ్మల పండుగ చేసుకుంటారు. ఆంధ్రబాలు రా పదినాళ్ళు వీరవిద్యాఖేలనాలలో వువ్విళ్ళూరిపోతారు. ప్రతి ఇంటా పండుగే. ఆ నాటి ఆంధ్రదేశంలో ఈ నవరాత్రి, దీపావళి, సంక్రాంతి, శ్రీరామనవమీ పెద్ద పండుగలు. ఆంధ్రబాలికలు ఈ నవరాత్రి ఉత్సవాలలో బొమ్మలు చిత్ర విచిత్రరీతుల అలంకరించి ఇరుగుపొరుగు బాలికలను పేరంటానికి పిలిచి, బొమ్మలకు హారతు లిచ్చి, నృత్య గీతాది వినోదా లర్పించి, శక్తికొలది పుణ్య స్త్రీలకు బహుమతు లందిస్తారు.

గణపతిరుద్ర మహారాజులవారి దేవేరుల నగరులలో గణపాంబాదేవి బాల్యమున ఈ ఉత్సవాలు బాగా జరిగేవి. ఈఏడు పెళ్ళికాని బాలిక అయిన అన్నాంబిక ఉండడంచేత రుద్రమదేవి బొమ్మలపండుగ తలపెట్టింది. ఈ పండుగకు నెలదినాల నుండీ రాజోద్యోగులు దేశదేశాల సాలభంజికలు, విగ్రహాలు, చిత్రాలు, విచిత్రాలు, వినోదాలు, కర్రబొమ్మలు, మట్టిబొమ్మలు, కొమ్ముబొమ్మలు, బంగారపు బొమ్మలు, వెండిబొమ్మలు, దంతమంజూషలు, కీలుబొమ్మలు రాచనగరిలో తెచ్చి వేసినారు.

దక్షిణాదినుండి దంతపుబొమ్మలు, ధరణికోటనుండి పాలరాతివిగ్రహాలు, నతనాటీసీమనుండి కఱ్ఱబొమ్మలు, సిందవాడినుండి ఎఱ్ఱచందనపు బొమ్మలు, గాంగవాడినుండి మంచిగంధపుచెక్క బొమ్మలు, కళింగమునుండి కొమ్ము బొమ్మలు, ఉత్తరాదినుండి ఇత్తడిబొమ్మలు, ఆంధ్రదేశమునం దంతటినుండి చిత్రలేఖనములు వచ్చినవి. చీనా, సువర్ణ, యవ, మలయ ద్వీపాల నుండి లక్కబొమ్మలు మోటుపల్లిలో దిగుమతి అయినవి. భారతావనిలో ఏదేశంలో ఏపనుల ప్రసిద్ధికెక్కినవో అవన్నీ వచ్చినవి.

ఒక మహామందిరమందు శిల్పు లీ విచిత్రమైన వస్తువులన్నీ అలంకరించినారు. ధూపకరండాలనుండి ధూపాలు వస్తున్నవి. ఆకాశంలోని నక్షత్రాలులా దీపాలు వేనకువేలు మిరుమిట్లాడుతూ ఆ మందిరం అంతా స్వర్గలోకం చేశాయి.

ఆవైపు శివలీలలు, ఈ వైపు విష్ణులీలలు, ఈవల పురాణగాథలు, ఇవన్నీ ఆంధ్ర దైనందిన జీవితఘట్టాలు. అక్కడక్కడ నర్తకీమేళం, ఇటు రాజసభ, అది సుధర్మ, అల్లదిగో ఆంధ్రగ్రామం ఒకటి. ఆ ఇళ్ళన్నీ బొమ్మలే. ఇళ్ళలోనుంచి రైతులు వచ్చి పొలాలకు పోతున్నారు. అదే గ్రామసభ. అది గ్రామంలోని పశువులు మేసే బయలు. ఈ నూతిలోనుంచి నీళ్ళు తోడుకుంటున్నారు. అక్కడ పొలం దున్నుతున్నారు.