పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గజదొంగ

151

7

లకుమయారెడ్డి సైన్యాలు గన్నయ్య సైన్యాలను ఆ అడవులలో, ఆ లోయలలో, ఆ కొండలలో, ఆ వాగులలో వెన్నంటి తరుముచు నాల్గురోజులు ఎన్నో కష్టాలకు లోనై, చిట్టచివరకు శత్రువుల జాడ తెలుసుకోలేక, తమలో ఎందరో పడిపోతుంటే, వారిని జాగ్రత్తగా తీసుకొని రాదగిన సైనికులను ఆపి తక్కిన వారు సాగిపోతూ గజదొంగలజట్లు భాగాలుగా విడిపోతే, తాము భాగాలై విడిపోతూ తుదకు శత్రువుల జాడలు, వారి అంతూ ఏమీ తెలియక, వెఱ్ఱిమొగాలు వేసుకొని తిరిగిరావడం ప్రారంభించారు.

చిన్న చిన్న జట్టులవారు తరుముతూ తరుముతూఉండగా, ఎలా వచ్చేదో ఒక పెద్ద విరోధివాహిని; వీళ్ళని వెనుకనుంచి చుట్టి కత్తులు, కటారులు మొదలయిన ఆయుధాలను లాక్కొని, బందీలచేసి తీసుకొని పోయేవారు. ఈ విధంగా నాల్గయిదు దినాలకు గన్నారెడ్డి సైన్యాలకు పదిహేనువేలమందికి పైగా బందీలు దొరికారు. వారినందరిని ఆ అడవులలోకి తీసుకొనిపోయి, ఇంత తినడానికి జొన్నరొట్టె, పిండి రెండుమాడల చొప్పున ఇచ్చి వదిలెడివారు. చాలమంది తమకు నిజమైన ప్రభువు గన్నారెడ్డేననీ, వారి సైన్యాలలో తాము చేరుతామనీ చెప్పిరి. గన్నారెడ్డి కోరిన ప్రతిజ్ఞలన్నీ నెరవేర్చి గన్నారెడ్డి సైన్యంలో చేరారు. అలా చేరినవారు మూడువేలమంది ఉండిరి.

లకుమయారెడ్డి సైన్యం ఈ విధంగా చిందరవంద రై పోయింది. అందులో పెద్దసైన్యాలు తిరిగి శ్రీశైలం చేరేసరికి లకుమయారెడ్డిని గన్నయ్య బందీచేసి తీసికొనిపోయాడని తెలిసి భయాక్రాంతు లైపోయారు. సేనాపతులు సమాలోచించుకొని మాట్లాడక వర్థమానపురం దారిపట్టి ప్రయాణాలు సాగించారు.

లకుమయారెడ్డి అన్నకుమారునిపై సలిపిన విజయయాత్ర ఈలా విచ్ఛిన్నమై దేశాలన్నిటిలో నవ్వులపాలైన పదిహేను దినాలకు గన్నారెడ్డి తన రహస్యపురంలో కొలువుతీర్చి తక్కిన ప్రభుకుమారులతో విషయపర్యాలోచన చేస్తూ ఉండెను.

అపసర్పగణాధిపుడైన సబ్బప్రభువు గన్నారెడ్డివైపు చూచి “ప్రభూ! లకుమయారెడ్డిని తమకు ఆలోచనచెప్పుతూ ఓరుగల్లునగనగరంలోనే ఉండవలసిందిగా శ్రీశ్రీశ్రీ రుద్రదేవమహారాజులంవారు ఆజ్ఞ ఇచ్చారు. ప్రసాదాదిత్య నాయకమహారాజు సైన్యాలతో కంచి చేరుకున్నారు. వర్థమానపురంలోని సైన్యాలలో నాల్గింట మూడువంతులు తగ్గింపవలసిందనిన్నీ, అలా చేయకపోతే వర్థమానపురం ముట్టడించి నేలమట్టం చేస్తామనీ నిండుసభలో శ్రీశ్రీశ్రీ రుద్రదేవ మహారాజులు లకుమయ మహారాజుతో చెప్పారు. లకుమయప్రభువు మొగం జేవురించింది. కత్తి వాటుకు రక్తపుచుక్క లేనట్లయింది మహాప్రభూ! అప్పుడు శివదేవయ్య మంత్రుల