పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠ గాథ

గజదొంగ

1

గన్నారెడ్డికి ఇప్పుడు ఇరువదినాల్గవయేడు జరుగుతున్నది. అతనికన్న రెండేళ్ళు చిన్న విఠలధరణీశుడు. గన్నారెడ్డి ఆరడుగుల పొడవు, కోలమోము, వెడదఫాలం, తుమ్మెదరెక్కలవంటి చిన్న కోరమీసాలు.

విఠలధరణీశుడు ఏనుగుగున్న. ఆతని బలం భీమబలం. అతడు ఎంత పెద్ద బండరాయినైనా బంతివలె ఎత్తి ఆవలకు గిరవాటు వేయగలడు. ఏనుగులతో కుస్తీ పట్టగలడు. సింహాలతో, పెద్దపులులతో నిరాయుధుడై యుద్ధంచేసి, చిన్న గాయమైనా లేకుండా వాని ప్రాణాలు హరింపగలడు; ఆతని దండలు చిన్న మద్దిచెట్టుల మొదళ్ళవలె ఉంటాయి; ఆతని ఛాతీ ఒక కొండచరియయే. ఆతడు వేళాకోళంగా వీపుమీద చరిస్తే స్నేహితులు కూలబడి మూడు పల్టీలు వేస్తారు.

గన్నారెడ్డికి విఠలధరణీశుడు కుడిచేయి అయితే, అయిదడుగుల పది అంగుళాలున్న సూరనరెడ్డి అనే యువకుడు ఎడమచేయి. సూరనరెడ్డి దేహం ఒక చిన్న కొండే. అతన్ని శూలంతో పొడిస్తే చీమ కుట్టిం దనుకుంటాడు. శూరులు అతనికి ప్రత్యర్థులుగా ఎదుట పడడం అంటే వణకిపోతారు. మనుష్యుల్ని, గుఱ్ఱాల్ని, ఏనుగుల్ని, రథాల్ని సునాయాసంగా ఎత్తి నేలనేసి కొట్టడం అంటే అతనికి మహాప్రీతి.

సూరనరెడ్డీ, విఠలుడూ మల్ల యుద్ధంచేస్తే రెండు కొండలు, రెండు భూగోళాలు ఢీకొన్నట్టే! ఇద్దరూ పెద్ద ఇనుపగదలతో యుద్ధం చేయడమంటే ఎంతో ముచ్చట పడతారు. కాని వీ రిరువురికన్నా సన్నగా ఉన్నా సింహవిక్రముడైన గన్నారెడ్డితో వారు మల్ల యుద్ధానికి తలపడరు. గన్నారెడ్డి పట్టుకు దొరకడు. ఆతని మాయలు ఒరు లెరుగరు.

గన్నారెడ్డికి ఇరవై ఒకటవ సంవత్సరం జరుగుతూఉన్న సమయంలో రాజవంశాలలోని యువకులు మూడువందల నలభై మందితో కలిసి ఓరుగల్లు వీడి అడవుల బడ్డాడు. తమ తమ మండలాలనుంచీ, విషయాలనుంచీ నాడులనుంచీ ఆ యా యువవీరులు దిట్టరులైన సైనికుల్ని సేకరించుకొన్నారు.

“మే మందరం గజదొంగలం, శ్రీ శ్రీ గణపతిదేవ చక్రవర్తి వృద్ధులై, రాజ్యభారం వహించలేని స్థితిలో, ఈ దేశంలో అరాచకం వచ్చింది కాబట్టి మేము మా ఇష్టంవచ్చినట్లు దేశాలను దోచుకుంటాము. అధర్మంలో అధర్మ