పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గజదొంగ

137

మౌతాము. రాక్షసులలో రాక్షసులమైతాము” అని శివదేవయ్య మంత్రికి కమ్మ వ్రాసి, వాండ్లు అడవులదారి పట్టినారు.

ఆ దినం ఓరుగల్లు దద్దరిల్లింది. కాకతీయవంశానికి భక్తులై, చక్రవర్తులకై తమ ప్రాణాలూ, తమ సర్వస్వమూ సమర్పించడానికి సిద్ధంగా ఉన్న మాండలికుల పుత్రు లెంతమందో ఆ గజదొంగల జట్టులో చేరారు. రేచెర్ల వారి బిడ్డ లెందరో అందులో చేరారు. మాల్యాల చౌండ్యసేనాని మనుమ డా జట్టులో చేరాడు. విర్యాలవారి బిడ్డలు చేరినారు.

ఈగజదొంగలజట్టుకు సర్వసేనాని గోనగన్నారెడ్డి, అతనిమాట ఆయువకులకు దేవాజ్ఞ. ఆతడంటే ప్రాణాలు విడుస్తారు. అతడు నిప్పులో దూకమంటే దూకుతారు. పెద్దపులిచెవులు పట్టుకొని లాక్కురమ్మంటే లాక్కువస్తారు.

గన్నారెడ్డి తాను గజదొంగల నాయకుడు కాకముందే శ్రీశైలానికి పడమరగా ఉండు నల్లమల అడవులలో, భయంకర ప్రదేశంలో పాడుపడిన పట్టణం ఒకటి చూచాడు. ఆ పట్టణం ఆంధ్ర శాతవాహన చక్రవర్తులనాటిది. నాగార్జున పర్వతలోయలో ఉన్న ఇక్ష్వాకుపట్టణమైన విజయపురంవలె ఈ నగరము ఆ పూర్వ కాలంలో మహోత్తమదశను అనుభవించింది. శాతవాహన రాజ్యాలు అడుగంటిన వెనుక పల్నాటిరాజులైన పల్లవులు విజృంభించినారు. ఆ దినాలలో ఈ నగరం పాలించే ఆంధ్రభృత్యుడైన ఒక శాతకర్ణి పల్లవులను ఎదిరించి ఆరేండ్లు పెక్కు యుద్ధాలలో ఓడించాడు. చివరకు పల్లవులచే ఓడిపోయారు. పల్లవు లా నగరమును నాశనంచేశారు. ఇరవై ఏళ్ళలో ఆ నగరాన్ని భయంకరరారణ్యం కబళించి వేసింది.

ఈ నగరం చుట్టూ, ఇక్ష్వాకుల విజయపురిచుట్టూ ఉండే కొండలకన్న ఎత్తయిన కొండ లున్నాయి. ఆ లోయలోనికి ఒక్కటేదారి. అది కృష్ణఒడ్డునుండే ఉన్నది. శ్రీశైల పర్వతప్రాంతాల కృష్ణానది కొండల దొలచుకొనిపోయి పాతాళ గంగలా ప్రవహిస్తున్నది. శ్రీశైలానికి పన్నెండుమైళ్ళ ఎగువలో కృష్ణకు తాకి ఉన్న ఒక కొండ రెండువందల బాహువుల ఎత్తు ఉంటుంది. (1 బాహువు = ఈనాటి 2 గజాలు) ఆ కొండప్రక్క ప్రదేశంఅంతా అడవితో నిండి ఉంది. ఆ అడవిలో ఒక విచిత్రమైనదారి ఉంది. తెలియనివారు ఆ దారిని ఒక సంవత్సరం పాడుపడినా కనుగొనలేరు.

ఆ పాడుపడిన నగరంలోని ఇళ్ళు, మేడలు గన్నారెడ్డి బాగు చేయించాడు. కూలిపోయిన కోటగోడలు మళ్ళీ యధా ప్రకారంగా కట్టించినాడు. అయినా ఆ గోడలమీద అడవితీగెలు, గుబురుచెట్లు ఇంకను పెంచినారు. పైకిచూస్తే పాడుపడి, మొక్కలతో నిండి ఉన్నట్టుంటుంది. కాని మేడలూ, నగరాలూ చక్కగా యథారీతి బాగుచేయించినాడు గన్నారెడ్డి.