పుట:Geetham Geetha Total.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24. తే. నేను గర్మంబు లొనరింప నేని జగతి
మనుజులెల్లను జెడుమార్గముననె చనరె ?
మరియుఁ గలుగదె వర్ణ సంకరము గానఁ
బ్రజల నెల్ల నేఁ జెఱిచిన వాఁడ గానె;

25. తే. సక్తచేతస్కుఁ డగుచుఁ దా సర్వగతుల
మూఢుఁ డేరీతిగాఁ గర్మముల నొనర్చు
జ్ఞానియును నట్లె మార్గదర్శకతకొఱకు
ఫలముగోరక కర్మముల్సలుపవలయు.

26. తే. జ్ఞాని గల్గింపఁగూడ దజ్ఞానులైన
కర్మసంగులబుద్ధికిఁ గలవరంబు;
పండితుఁడు కర్మతంత్రుఁడై ప్రజలచేతఁ
గర్మములను జేయుంచుట ధర్మము సుమి.

27. తే. ప్రకృతిజనిత గుణంబుల వలన వివిధ
గతుల నొనరింపఁబడు నెల్ల కార్యములకుఁ
గర్త తానే యటం చహంకార్యమగ్నుఁ
డౌ విమూఢాత్ముఁ డనుకొనునవనిఁ బార్థ !

28. తే. కర్మముల గుణముల విభాగం బెఱుంగు
తత్త్వవిదుఁ డైనవాఁడట్టి తలఁపు గొనక
త్రిగుణముల కార్యములె కర్మలగు నటంచుఁ
దలఁచుకొనుచుండు నాసక్తి వలను గనక.

29. తే. ప్రకృతి జనిత గుణంబుల బద్ధులైన
జనుల కాగుణకర్మములే సక్తి గొలుపు;
జ్ఞానులగువార లట్టియ జ్ఞానవరులఁ
జలన మొందింపగారాదు సవ్యసాచి !