పుట:Geetham Geetha Total.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. తే. వాని కేకృత్యమునను లాభంబు లేదు
సలుపనట్టికృత్యముల నష్టంబు లేదు;
ఆతఁడే ప్రయోజనముకై యాశ్రయింప
వలసినది సయితములేదు వసుధయందు.

19. తే. కావునం గర్మఫలములఁ గాంక్ష లేక
కర్మయోగి వై చేయుము కార్యములను;
సంగనిర్ముక్త కర్మంబు సల్పుపురుషుఁ
డాత్మసంప్రాప్తిఁ బొందువాఁడతులితముగ.

20. తే. కర్మయోగంబుచేఁ గదా కాంచగల్గి
రటులు జనకాదు లెల్ల రాత్మానుభవము;
జగతి జనులకు మార్గదర్శకుండ వగుట
కైనఁ గర్మంబు లొనరించుటవసరంబు.

21. తే. శ్రేష్ఠు లెయ్యది యాచరించెదరు భువిని
దానినే యాచరింతు రితరజనములు;
ఏ ప్రమాణంబుఁ జూపు వాఁడెల్లరకును
నయ్యదియె యనువర్తింతురఖిలజనులు.

22. తే. నాకుఁ గర్తవ్య మనునదే నాస్తి పార్థ!
యీ త్రిభువనంబులందు నేనింతవఱకుఁ
బడయనిది కర్మచయముచేఁ బడయవలసి
నదియు లే, దైనఁ గర్మంబు లాచరింతు.

23. తే. పార్థ! నే నెప్పుడైనను బ్రాలుమాలి
యూరకయె కర్మ మొనరింపకుందునేని
యన్ని విధముల నామార్గమనుసరించి
యట్ల యొనరింపరే యెల్ల యవని జనులు.