పుట:Geetham Geetha Total.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

69. తే. ఎల్లజనుల కజాగ్రత్త యెందుఁ గలదొ
యందె జాగ్రత్త గలుగు సంయముల కెల్ల
సర్వభూతము ల్జాగ్రత్త సల్పునెడల
వా రజాగ్రత్త వహియించు వారగుదురు.

70. తే. నిండి నిబిడీకృతంబుగా నిలుచుజలధి
నదులజల మెంత చేరినఁ గదలనట్టు
లెవండు కామముల్‌ సేరఁజలింపఁబడఁడొ

వాఁడె కను శాంతి; కామియౌ వాడు గనఁడు.
71. తే. సర్వకామము ల్విడనాడి జనుఁడు, వాని
స్పృహల సహితము మనుసునఁ జేరనీక
మమత లేకుండ దురభిమానమును లేక
సంచరించినఁ, దప్పక శాంతినొందు.

72. ఆ. ఇదియ బ్రహ్మ మందహేతు వౌ స్థితి సుమీ
యిందుఁ దగిలి మోహ మందఁ డెవఁడు;
కలిగి దీని మరణ కాలంబునందైన
బ్రహ్మపదము నరుఁడు పడయుఁ బార్థ !

బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

రెండవ అధ్యాయము, సాంఖ్యయోగము సమాప్తము.