పుట:Geetham Geetha Total.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52. ఆ. నీదుబుద్ధి మోహనిర్ముక్త మెపు డౌనొ
యపుడె, నీవు వినినయర్థమునకు,
వినఁగవలయు నర్థవివరణమునకు వై
రాగ్య మొదవు సంగ రహిత మగుచు.
                                                                           
53. తే. వివిధ వేదార్థముల విని, వికలమైన
నీదుబుద్ధి సమాధిలో నిశ్చలముగ
నెపుడు నిలువంగఁబడునో నీవపుడె పార్థ !
బుద్ధి యోగంబు నిజముగాఁ బొందఁగలవు.

అర్జునుడిట్లనియె :-

54. ఆ. మౌనివంద్య ! భువి సమాధిస్థుఁ డౌస్థిత
ప్రజ్ఞునకుఁ జెలంగు భాష యెద్ధి?
అతఁడు పలుకు టెట్టు? లాసీనుఁడగు టెట్లు ?
వర్తనం బదెట్లు వనరుహాక్ష !

శ్రీ భగవంతుడిట్లనియె :-

55. ఆ. అనఘ! వినుము మనసునందలికామముల్‌
విడిచిపుచ్చి నరుడు విమలమైన
యాత్మలోనె తుష్ఠి యందినచో, స్థిత
ప్రజ్ఞుఁడనుచు నతఁడు పల్కబడును.

56. ఆ. దుఃఖములను వికృతి దోషంబుఁ జెందక
సుఖములందుఁ బరవశుండు గాక
రాగకోపభయ విరహితుఁడౌ నరు స్థిత
ప్రజ్ఞుఁడండ్రు భువినిఁ బ్రాజ్ఞు లెల్ల.