పుట:Geetham Geetha Total.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56.ఆ. సర్వకర్మచయము సహితంబు, నను నెప్పు
డాశ్రయించి, సలుపునట్టివాఁడు
అవ్యయంబు నిత్యమౌపదంబు పరంబు
నందు, నాయనుగ్రహంబుకలిమి.

57. తే. మనసుచే నాకు సర్వకర్మములు విడిచి
పరమప్రాప్యంబుగా నన్నె మదిని దలఁచి
బుద్ధియోగంబు నాధారముగ వహించి
చిత్త మెప్పుడు నాయందెచేర్పు మీవు.

58. తే. చిత్తమున నన్నజస్రముఁ జేర్ప, సర్వ
దుఃఖముల నాకటాక్షంబె తొలఁగఁ జేయు;
నీ వహంకారభావంబు నే వహించి
నాదువచనము ల్వినకున్న నాశ మగుదు.

59. తే. అటు లహంకారభావ మీవాశ్రయించి
బవర మొనరింపనని పట్టుపట్టితేని
నీదునిశ్చయం బయ్యది నిలువఁబోదు;
ప్రకృతి నిన్ను నియోగించి పంపఁగలదు.

60. ఆ. భ్రాంతివలనఁ జేయరా దంచు నెద్దాని
సలుపఁ దలఁపకుంటి సవ్యసాచి!
నీ స్వభావకర్మ నిర్బంధితుండ వై
దానిఁ జేతు వస్వతంత్ర బుద్ధి.

61. ఆ. సర్వభూతములను సంభ్రమింపఁగఁ జేయ
నీశ్వరుండు వాని హృదయపీఠి
నిలిచి త్రిప్పుచుండు నిజమాయ నవి యెల్ల
నూఁది యంత్ర మెక్కి యున్నయట్లు.