పుట:Geetham Geetha Total.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24.ఆ. కామియగుచు నరుఁడు కడుఁ బ్రయాసముతోడఁ
గర్త తా నటంచు గర్వపడుచు
నెట్టికర్మ సేయు నట్టిదానికిఁ బేరు
రాజసంబు పాండురాజతనయ!

25. తే. ఏది యొనరింప నెది వచ్చు నేది పోవు
హింస యేదేనిఁ గలుగునొ, యెంతశక్తి
కలదొ, తలపోయకయె భ్రాంతి వలనఁ జేయు
కర్మ నందురు తామస కర్మమనుచు.

26. తే. అర్జునా! సంగనిర్ముక్తుఁడగుచుఁ, గర్త
తాను గాఁ డంచు, ధృతియును త్సాహ మూని
కార్యసిద్ధ్య సిద్ధులచేతఁ గలఁతపడక
కర్మలొనరించు సాత్త్విక కర్త యెపుడు.

27. తే. రాగియై కర్మఫలమందు రక్తి గలిగి
లోభగుణుఁడౌచు, శుచి లేక, లోకహింస
సల్పుచును, హర్ష శోకవి కల్పుఁ డైన
కర్త యగువాని, రాజసకర్త యండ్రు.

28. ఆ. ప్రాకృతుం డయుక్త వరుఁడు నైకృతికుండు
స్తబ్ధుఁడును, విషాది, శఠుఁ, డలసుఁడు
దీర్ఘసూత్రి, యైనఁ దెలియు మీతనిఁ గర్త
లందుఁ దామసు డటంచుఁ బార్థ!

29. తే. బుద్ధిభేదముల్‌ ధృతిభేదములుఁ జెలంగుఁ
ద్రిగుణములఁబట్టి యొండొండు త్రివిధములుగ
వాని నిశ్శేషముగ వేఱు పఱచి నీకు
వివరణము సేయఁ బూనితి విను కిరీటీ!