పుట:Geetham Geetha Total.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18.తే. జ్ఞానమును జ్ఞేయమును బరిజ్ఞాతయునని
మూఁడువిధములున్నవి కర్మమునకు విధులు;
కరణమును గర్మమును మఱి కర్త యనియుఁ
గర్మసంగ్రహవిధులును గలవు మూఁడు.

19. తే. గుణవివరణంబు గల ప్రకరణమునందు
జ్ఞానమును గర్మకర్తల లోనిగుణవి
భేదములఁబట్టి త్రివిధముల్‌ పేర్కొనఁబడె;
వానికలరూపు తెలియంగఁబఱతు వినుము.

20. తే. వేఱువేఱురూపంబుల వెలసియుండు
సర్వభూతంబులందలి సత్త్వ మొకటె
యవ్యయం బవిభక్తమౌననుచుఁ దెలుపు
జ్ఞానమే యిల సాత్త్విక జ్ఞాన మండ్రు.

21. తే. వేఱు వేఱుభూతంబుల వేఱువేఱు
యాత్మ లనియును వానిగు ణాదు లెల్ల
వేఱువే ఱంచు నరుని భావింపఁ జేయు
జ్ఞానమయ్యది రాజస జ్ఞాన మండ్రు.

22. తే. అకట! నిష్కారణం బసత్యంబు నల్ప
మైన నొక్కకార్యంబె సర్వార్థసిద్ధి
యనుచు నాసక్తి దానియందావహించు
నదియ తామసజ్ఞానం బటండ్రు బుధులు.

23. ఆ. నియతకర్మ, సంగ నిర్ముక్తముగ రాగ
వర్జితముగ ద్వేష వర్జితముగ
నఫలకాంక్షతోడ నాచరించెడుదాని
సాత్త్వికం బటండ్రు శాస్త్రవిధులు.