పుట:Geetham Geetha Total.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12.ఆ. త్యాగబుద్ధి లేక యాచరించెడు కర్మ
మవల నొసఁగు ఫలము త్రివిధ మిష్ట
మును ననిష్ట మిశ్రములు నాఁ బరఁగుచుండుఁ
ద్యాగి కట్టి వెవ్వి తగులఁబోవు.

13. ఆ. సర్వకర్మములకు సంసిద్ధి యొనరించు
కారణంబు లైదు గలవు వాని
సాంఖ్యయోగి నుడువు సరణి బోధించెద
వినుము శ్రద్ధతోడ వీరవర్య!

14. తే. అవి శరీరంబుఁ గర్తయునట్లె వివిధ
కరణములఁ జేష్టితంబులఁ గలసి వీని
వరుస నాల్గింటితోడ దెవంబుఁ జేరఁ
గర్మ కలుగుట కగుఁ బంచ కారణములు.

15. ఆ. న్యాయమైన నొండె న్యాయంబు గాకొండె
మానవుండు వాక్కు మనసుకాయ
ముల నుపక్రమింపఁ బూనుకర్మములకు
బరఁగు నివియ హేతు పంచకముగ.

16. ఆ. ఇది యిటుండఁ గర్మ కెవ్వం డకృతబుద్ధి
దానె కర్త యనుచుఁ దలఁచు నాత్మ,
నట్టివాఁడు కుమతి యౌఁగాని, నిశ్చయం
బెఱుఁగఁబోఁడు పార్థ! యెన్నఁటికిని.

17. తే. ఎవనిభావంబునం దహం కృతి గలుగదొ
ఫలముపై నెవ్వనికి బుద్ధి పట్టువడదొ
యాతఁ డీలోకములఁ జంపు నాతఁ డయ్యు
హంతకుఁడు గాఁడు; బంధంబులంట వతని.