పుట:Geetham Geetha Total.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17.కం. ఫలకాంక్ష లేక, యోగ్యత
గలమనుజులు మిగుల శ్రద్ధగా నొనరింపం
జెలఁగెడు నీత్రితపంబుల
నిల సాత్త్వికతపము లందు రింద్రతనూజా!

18. ఆ. సత్కరింపుకొఱకు సన్మానముకొఱకుఁ
బూజకొఱకు దంభ పూర్వకముగఁ
జంచలంబు మఱియు క్షయకరం బగురీతి
సలుపుతపము రాజసం బటండ్రు.

19. ఆ. తెలివి లేనిపట్టుదలతోడ మిగులఁ గ
ష్టంబుతోడ నరుఁడు సల్పుతపము
పరవినాశమునకుఁ బరఁగిం చుతపమును
దామసం బటండ్రు ధరణి బుధులు.

20. తే. దాన మొనరింపవలె నను తలఁపు గలిగి
దేశకాలపాత్రంబులఁ దెలిసికొనుచు
మేలు బదులు సేయఁగ శక్తిచాలనట్టి
సజ్జనున కిచ్చుదానంబు సాత్త్వికంబు.

21. ఆ. ఫలమునందుఁ గాంక్ష ప్రత్యుపకారంబు
నందుఁ దలఁపు గలిగి యాచరించు
క్లిష్టదానములను గృతబుద్ధులమతంబు
నందు రాజసం బటండ్రు పార్థ!