పుట:Geetham Geetha Total.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12.తే.అఖిలజగము ప్రకాశించునట్లు చేయు
భాస్కరుఁడు చూపు తేజంబు, పావకుండుఁ
జంద్రుఁడును గల్గియుండు తేజస్సు, పార్థ!
యెఱుఁగవలయును నా తేజమే యటంచు.

13. తే. ధరఁ బ్రవేశించి సర్వభూతముల నాదు
బలముచేతనె ధరియించి ప్రబలుచుందు;
అమృతమయుఁ డగుచంద్రుండనగుచు నేన
యెల్లయోషధు లరసి పోషింతు నెపుడు.

14. తే. అన్నిప్రాణులదేహంబులందు నేన
యగ్నిదేవుండ నై వాని నాశ్రయించి
యలచతుర్విధభక్ష్యంబు లఱుగఁ జేతుఁ
బ్రాణము నపానవాయువుల్పరఁగఁ జేసి.

15. తే. ఏ నఖిలభూతముల నుందు హృదయపీఠి;
నావలనఁ గల్గు స్మృతియు జ్ఞానంబు నూహ;
లెఱుకపఱచును వేదంబు లెల్ల నన్నె;
వేదఫలదాతయును వేదవిదుఁడ నేన.

16. తే. లోకమందలిపురుషులలోనఁ గలవు
రెండు తెఱఁగులు; క్షరుఁ డక్షరుం డటంచు;
సర్వభూతంబులందును క్షరుఁడు గలఁడు;
అక్షరునిపేరు కూటస్థుఁడండ్రు బుధులు.

17. తే. ఉత్తముం డగుపురుషుఁ డన్యుండు గలఁడు;
వాఁడె పరమాత్మ యనుపేరఁ బరఁగుచుండు;
అతఁడు లోకత్రయంబునందావహించి
యవ్యయుం డైన యీశ్వరుఁడై భరించు.