పుట:Geetham Geetha Total.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17.తే. ఉర్వి భూతంబులన్నిట నొక్క రూప
మునఁ జెలంగియు బహురూపములను జూపు;
ఏది భూతంబులకు భర్త యేది భోక్త
ఏది హేతువొ యదె జ్ఞేయ మెఱుకఁ గనుము.

18. తే. జ్యోతులకు నెల్ల మిక్కిలి జ్యోతి యగుచుఁ
బ్రకృతికంటెను బరమ మైపరఁగుచుండు
జ్ఞానమును జ్ఞేయమును జ్ఞాన గమ్య మగుచు
సర్వప్రాణులహృది నివాసంబు సేయు

19. తే. క్షేత్రమును జ్ఞానమును మఱి జ్ఞేయ మనఁగ
నిట్లు సంక్షేపముగ వచియింపబడియె;
బాగుగా దీనిఁ దెలిసి నా భక్త జనుఁడు
యోగ్యతను బొంది నాభావ మొందఁగలడు.

20. ఆ. పురుషుఁడును బ్రకృతియు నరయ నీరెండును
నాది లేనియట్టి వం చెఱుఁగుము;
కలిగి వెడలుగుణవికారంబు లెల్లను
బ్రభవ మందుచుండుఁ బ్రకృతివలన.

21. తే. ప్రకృతి హేతువు కార్యకారణములకును
మఱియుఁ గర్తృత్వమునకును మహినిఁ బార్థ !
పురుషుఁడన్ననొ, తా హేతుభూతుఁడగును
సుఖముదుఃఖంబు లనుభవించుటకు నెపుడు.

22. తే. ప్రకృతియం దుండి పురుషుండు ప్రకృతిసంభ
వములగుణములతోడ సంబంధ మొందు;
మంచిచెడుయోనులందు జన్మంబు లొంద
గుణములందలి సక్తి కారణ మతనికి.