పుట:Geetham Geetha Total.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత

త్రయోదశాధ్యాయము.

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము


అర్జునుడిట్లనియె :-

01. ఆ. క్షేత్ర మనఁగ నెద్ది? క్షేత్రజ్ఞుఁ డెవ్వండు?
ఎట్టివాఁడు పురుషుఁ? డేది ప్రకృతి?
జ్ఞానమేది? జ్ఞేయమైనది యెయ్యది?
తెలియఁజెపుము వాసు దేవ! నాకు

 శ్రీ భగవంతుడిట్లనియె :-

02. తే. ఈశరీరంబు యగు క్షేత్ర మింద్రతనయ!
దీని నెవ్వం డెఱుంగునో వాని మహిని
దత్త్వవిదు లైనవారి మతం బునందుఁ
జెలఁగ క్షేత్రజ్ఞుఁ డను పేరఁ జెప్పుచుంద్రు.

03. తే. ఉర్వి నెల్ల క్షేత్రములు, నందున్న క్షేత్ర
వేత్తగాఁ గూడ నన్నె భావించుకొనుము;
ఇట్లు క్షేత్రజ్ఞు క్షేత్రంబు నెఱుకపఱచు
జ్ఞానమే యుపాదేయ మౌ జ్ఞాన మగును.

04. తే. అట్టిక్షేత్రం బ దేదియో, యెట్టి దగునొ
ఏ వికారము ల్గలదియో యేల కలదొ,
ఎవఁడు క్షేత్రజ్ఞుఁడో వానికేప్రభావ
ములు చెలంగునొ సంగ్రహముగ వచింతు.