పుట:Geetham Geetha Total.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. తే. అట్టి భక్తియోగమున నన్నాశ్రయింప
శక్తిసామర్థ్యములు నీకుఁ జాలవేని
నెమ్మనముపోక లెల్లను నిగ్రహించి
యఖిలకర్మఫలత్యాగి వగుము పార్థ!

12. తే. మూఢుఁ డొనరించునభ్యాసమునకు జ్ఞాన
మున్న మేలు, ధ్యానము దాని కన్న మేలు;
ధ్యానమును మించినది ఫల త్యాగము సుమి;
జనున కట్టి త్యాగంబుచే శాంతి గల్గు.

13. తే. సర్వభూతంబులందు ద్వేషంబు లేక
కరుణ వహియించి స్నేహంబు గలిగి, మమత
విడిచి మది నహంకారంబు నుడుగఁ జేసి
సమత సుఖదుఃఖములఁ జూచి క్షమ వహించి.

14. తే. నిత్యసంతుష్టితో యోగనిరతిఁ బూని
నియమిత మనుస్కుఁ డై దృఢనిశ్చయమున
బుద్ధి నాయందె నిల్పు వి శుద్ధ చరితుఁ
డైనభక్తునియందు నాకధికప్రేమ.

15. తే. జగతిచే నెట్టివానికి జడుపు లేదొ
జగతి కెవనిచేఁ గలుగదొ జడుపు, వాఁడు
హర్షమును గోపమును మనోవ్యాకులమును
భయమునుం బొంద డతడె నాప్రియుడు పార్థ!

16. ఆ. దక్షుఁడై జనుండుదాసీనుఁడై గత
వ్యథుఁడు శుచియు నగుచు వాంఛలేక
సర్వ విషయములను సంకల్పరహితుఁడై
భక్తుఁడైన, నాకుఁ బరమప్రియుఁడు